ఎగ్జిట్ పోల్స్ : బీజేపీదే రాజస్థాన్....మధ్యప్రదేశ్ లో హోరా హోరీ...!
ముందుగా చూస్తే జన్ కీ బాత్ సర్వే ప్రకారం మధ్య ప్రదేశ్ లో బీజేపీకి వంద నుంచి 123 దాకా సీట్లు రావచ్చు అని సర్వే వెల్లడించింది
By: Tupaki Desk | 30 Nov 2023 1:10 PM GMTఎగ్జిట్ పోల్స్ వరసబెట్టి వెలువడుతున్నాయి. దేశంలో అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానుండగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఓటర్ల మనసు ఎరిగి న సర్వే సంస్థలు వాటిని జనం ముందు పెట్టాయి. తెలంగాణాలో పోలింగ్ ఇలా ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లువలా వచ్చేశాయి.
తెలంగాణాలో కాంగ్రెస్ దే విజయం అంటూ చాలా ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అదే విధంగా దేశంలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన తమకు ఉన్న అంచనాలను ప్రకటించాయి. ఆ అంచనాలను పరిశీలిస్తే బీజేపీకి రాజస్థాన్ కచ్చితంగా దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని కూడా చెబుతున్నాయి.
ముందుగా చూస్తే జన్ కీ బాత్ సర్వే ప్రకారం మధ్య ప్రదేశ్ లో బీజేపీకి వంద నుంచి 123 దాకా సీట్లు రావచ్చు అని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కి 102 నుంచి 125 దాకా సీట్లు వస్తాయని లెక్క తేల్చింది. రిపబ్లిక్ టీవీ మ్యాట్రిజ్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూస్తే బీజేపీకి 118 నుంచి 130 దాకా సీట్లు దక్కుతాయని వెల్లడించింది. కాంగ్రెస్ కి 97 నుంచి 107 దాకా ఇచ్చింది. అంటే మధ్యప్రదేశ్ బీజేపీదే అని ఈ సంస్థ చెప్పిందన్న మాట. ఇక టీవీ9 భారత్ వర్ష్ అన్న సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే బీజేపీకి 106 నుంచి 116 దాకా సీట్లు మధ్యప్రదేశ్ లో వస్తాయి. కాంగ్రెస్ ని 11 నుంచి 121 దాకా వస్తాయని పేర్కొంది.
ఇక రాజస్థాన్ లో చూస్తే బీజేపీకే అధికారం అని పలు సర్వేల ఎగ్జిట్ పోల్స్ తేల్చేసాయి. జన్ కీ బాత్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలో బీజేపీకి ఏకంగా 100 నుంచి 122 దాకా లభిస్తాయని తేలింది. కాంగ్రెస్ కి 62-85 మధ్యలోనే వస్తాయని అంచనా వేసింది. అలాగే రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ని చూస్తే బీజేపీకి 100 నుంచి 110 దాకా కాంగ్రెస్ కి 90 నుంచి 100 దాకా సీట్లు వస్తాయని తేలించి.
ఇక మరిన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ దే అధికారం అని చెబుతున్నాయి. అలాగే మిజోరాం లో కాంగ్రెస్ కి పట్టం కడుతున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ కి అయిదింట నాలుగు రాష్ట్రాలు దక్కుతాయా అన్నది చూడాలి. అయితే బీజేపీకి రాజస్థాన్ తో పాటు మధ్యప్రదేశ్ కనుక దక్కితే మాత్రం సగం పైగా విజయం సాధించినట్లే అని అంటున్నారు.