దేశవ్యాప్తంగా.. ప్రతిపక్షాలకే జనం జేజేలు.. ఏపీలో ఏం జరుగుతుంది?
దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలను తీసుకుంటే.. అధికార పార్టీల విషయంలో ప్రజలు విశ్వాసం కోల్పోతు న్నారనే వాదన వినిపిస్తోంది
By: Tupaki Desk | 5 Dec 2023 9:02 AM GMTదేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలను తీసుకుంటే.. అధికార పార్టీల విషయంలో ప్రజలు విశ్వాసం కోల్పోతు న్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఇదే తరహా ఫలితమే కనిపించింది. ఈ ఏడాది మొత్తంగా .. ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు వచ్చాయి. ఒక్క గుజరాత్, మధ్యప్రదేశ్ లలో మాత్రమే అధికార పార్టీ మళ్లీ పుంజుకుంది.
తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకే ప్రజలు అధికార పీఠాన్ని అప్పగిం చారు. ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వాల ఉదాశీన విధానాలు కావొచ్చు.. అప్పుల కుప్పలుగా రాష్ట్రాలను తయారు చేస్తున్నారన్న ఆగ్రహం కావొచ్చు. ఉపాధి, ఉద్యోగాల కల్పన సహా.. పారిశ్రామిక విధానాల్లో చోటు చేసుకుంటున్న లోపభూయిష్ట విధానాలు కావొచ్చు. ఏదేమైనా.. అధికార పార్టీలకు.. ప్రజలు బాగానే సమాధానం చెప్పారు.
మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం... ఇలానే కొనసాగితే.. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక సమరంతో పాటు.. ఏపీ తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిసా, సిక్కిం, హరియాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలోనూ తొలి నాలుగు మాసాల్లో అంటే. ఏప్రిల్‌లో ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఎన్నికలు జరగున్నాయి.
ఇక, ఈశాన్య రాష్ట్రాలను పక్కన పెడితే.. ప్రధానంగా ఏపీపైనా, ఒడిశా పైనే ఎక్కువగా ఫోకస్ ఉంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్.. బూస్ట్ ఇచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఎన్ని పథకాలు పెట్టినా.. ఎన్ని ఉచితాలు ఇచ్చినా.. చివరకు ప్రతిపక్షాలవైపే ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యంగా తెలంగాణ, మిజోరంలలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ.. ప్రజలు ప్రతిపక్షానికే జై కొట్టడాన్ని బట్టి.. ఏపీలోనూ అదే జరుగుతుందనే లెక్కలు ప్రతిపక్షం వేసుకుంటోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.