పైకం రాజకీయాలు ఫలిస్తాయా? తెలంగాణ రిజల్ట్ ఏం చెబుతోంది?
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ సహా.. పలు పార్టీలు డబ్బులు కుమ్మరించా యనే వార్తలు వచ్చాయి
By: Tupaki Desk | 23 Dec 2023 2:30 PM GMTవచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ డబ్బులు పెట్టి ఓట్లు కొంటారని.. కొన్ని పార్టీలు ఆమేరకు డబ్బులు కూడా రెడీ చేసుకుంటున్నాయని పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు కూడా పంచుతారనే చర్చ సాగుతోంది. అయితే.. ఇలా పైకం పంచి.. ఓట్లు వేయించుకునే పరిస్థితి ఎంత వరకు ఉంటుంది? అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రజల నాడి ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ సహా.. పలు పార్టీలు డబ్బులు కుమ్మరించా యనే వార్తలు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల నాయకులు తమకు సొమ్ములు ఇవ్వలేదని పేర్కొంటూ ప్రజలు సైతం బయటకు వచ్చి ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. ఇలా డబ్బులు పంచిన మేరకు ప్రజలు ఓటు వేసి ఉంటే.. ఆయా నాయకులు గెలిచి ఉండాలి. కానీ, అలా జరగలేదు కదా!
ముఖ్యంగా ప్రధాన పార్టీ ఒకటి భారీ ఎత్తున డబ్బులు కుమ్మరించిందని కొన్ని పార్టీలు విమర్శలు చేశాయి. అయినా.. ఆ పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు.. అధికారం కూడా దక్కలేదు. సో.. ప్రజల నాడి నాయకులపైనా, వారి వ్యవహార శైలిపైనే ఆధారపడి ఉంటుందనే విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తేలిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీ విషయానికి వచ్చినా.. ప్రజలు ఇదే విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటారని అంటున్నారు.
ఏపీలోనూ నాయకులను బట్టి.. వారు గతంలో వ్యవహరించిన తీరును బట్టే ప్రజలు తీర్పు ఇస్తారనేది పరిశీలకుల మాట. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొంత మేరకు డబ్బుల ప్రభావం ఉంటే ఉండొచ్చని అంటున్నారు. అంత మాత్రాన కేవలం డబ్బులతోనే అధికారంలోకి వచ్చేయడం అనేది కుదిరే పనికాదని పరిశీలకులు చెబుతున్నారు. విశ్వసనీయత, నాయకుడిపైన, పార్టీపైన నమ్మకం వంటివి ప్రధానంగా పనిచేస్తాయని అంటున్నారు. మరి ఏపీలో ఏం జరుగుతుందో చూడాలి.