అసెంబ్లీ ఎన్నికలు ... మోడీ ప్రభుత్వానికి సవాల్
ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అవి ఎంతో కీలకమైనవిగా ఉన్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2024 4:10 AM GMTఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అవి ఎంతో కీలకమైనవిగా ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర చాలా ప్రాధాన్యత కలిగినది. ఈ ఏడాది నవంబర్ 26తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసిపోతోంది. అంటే కేవలం అయిదు నెలలు మాత్రమే గడువు ఉంది.
మహారాష్ట్రలో గత అయిదేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అది రోజుల వ్యవధిలోనే గతించింది. ఆ తరువాత ఏడాదిన్నర పాటు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సీఎం గా మహా కూటమి ఏర్పడింది. దానిని 2022లో కూల్చి ఏక్ నాధ్ షిండేని సీఎం గా చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది.
అయితే ఈ చీలికలు రాజకీయ ఫిరాయింపుల కంపుని చూసిన మహారాష్ట్ర ప్రజలు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తిప్పికొట్టారు కేవలం ఎంపీలు మాత్రమే అధికార కూటమికి వస్తే కాంగ్రెస్ ఎన్సీపీ శివసేనలకు 31 ఎంపీలు వచ్చాయి.
ఈ ఫలితాలను అసెంబ్లీకి అన్వయించుకుంటే వచ్చేది శివసేన ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని విపక్ష కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. అది కనుక జరిగితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
ఇక హర్యానాలో కూడా ఈ ఏడాది నవంబర్ 4తో ప్రభుత్వ పదవీకాలం పూర్తి అవుతుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ యాంటీ ఇంకెంబెన్సీ ఉంది . పైగా 2019లో బీజేపీకి మెజారిటీ సీట్లు రాలేదు. దాంతో జేజేపీ పార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే లుకలుకలు స్టార్ట్ కావడంతో అక్కడ సీఎం గా ఉన్న మనోహర్ ఖట్టర్ ని తెచ్చి కేంద్ర మంత్రిని చేశారు.
ఈసారి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్నది చూడాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీకి కాల పరిమితి ముగుస్తోంది. దానికి కూడా కలుపుకుని ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తీ మోర్చా ప్రభుత్వం ఉంది. హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేసి ఉంచారు. ఈసారి జార్ఖండ్ లో గెలవాలని బీజేపీ చూస్తోంది. కానీ హేమంత్ సోరెన్ అరెస్ట్ తో సానుభూతి పెరిగింది అని అంటున్నారు.
దాంతో పాటు కాంగ్రెస్ వామపక్షలు బలంగా ఉన్నాయి. ఇక్కడ విపక్ష కూటమి గెలిస్తే బీజేపీకి దెబ్బ అని అంటున్నారు. వీటితో పాటుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ ఇండియా కూటమి కూడా బలంగా ఉంది. పైగా నితీష్ కుమార్ జంపింగుల పట్ల జనంలో చర్చ సాగుతోంది.
పరిణామాలు మారితే అపుడు ఎన్డీయే కూటమికి ఇబ్బందులే అని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అని అరెస్ట్ చేయడంతో ఆ సానుభూతి ఆప్ కి కలసి వచ్చి మళ్లీ అధికారంలోకి రావచ్చు అంటున్నారు. ఇలా దాదాపు ఏడాది వ్యవధిలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, బీహార్ వంటి పెద్ద స్టేట్స్ తో పాటు హర్యానాని నిలబెట్టుకుని మెజారిటీ గెలిస్తే కేంద్రంలో ఎన్డీయే కూటమికి ఇబ్బంది ఉండదని అంటున్నారు. లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరే ప్రమాదం ఉందని అంటున్నారు.