అధినేతలు సీట్లు మారుస్తుంటే... నేతలు ఓట్లను మారుస్తున్నారంట!
ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇటీవల ఓటర్ల జాబితానూ విడుదల చేసేసింది
By: Tupaki Desk | 24 Jan 2024 11:30 AM GMTఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఇటీవల ఓటర్ల జాబితానూ విడుదల చేసేసింది. ఇక మిగిలిన కార్యక్రమాల్లోనూ బిజీ అయిపోయిందని అంటున్నారు. మరోపక్క రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల మార్పులు చేర్పులు, ప్రచార కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. దీంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
కారణాలు ఏవైనా.. ఎవరైనా.. ఒక నాయకుడు తాను ఉన్న పార్టీలో నుంచి మరోపార్టీలోకి వెళ్లాలని అనుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైన విషయం. పైగా... ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఇది పరమ రొటీన్ విషయం. టిక్కెట్ రాలేదనో.. అడిగిన చోట టిక్కెట్ ఇవ్వలేదనో... తనతో పాటు తన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వలేదనో... కారణాలు ఏవైనా... ఈ సమయంలో కండువాలు మార్చడం చాలా సర్వసాధారణం.
ఇలా కండువాలు మార్చిన నాయకులు... వారితో పాటు వారి అనుచరులను కూడా పక్కపార్టీకి తీసుకుని వెళ్తుంటారు. వారికి కూడా కండువాలు మారుస్తుంటారు. అసలు తాను కండువాలు మార్చిందే కార్యకర్తల సూచనలు, అభిష్టం మేరకు అని కూడా చెబుతుంటారు! ఈ క్రమంలోనే ఇటీవల టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నానీ కూడా తనతో పాటు తన అనుచరులను పెద్ద ఎత్తున ఫ్యాన్ కిందకి చేర్చారు.
ఇదే సమయంలో... తన వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు.. అసెంబ్లీ టికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఇదే సమయంలో మరికొంతమందికి స్థానిక సంస్థలకు సంబంధించిన హామీలు ఇప్పించారని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల కాలంలో పలువురు సిట్టింగులకు, లోకల్ నేతలకు స్థాన చలనాలు కలుగుతున్నాయి. దీంతో... తమ తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా.. పార్టీ సూచించిన చోట పోటీచేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆయా నేతలు సరికొత్త ఆలోచన చేశారంట.
ఇందులో భాగంగా... తాము పోటీ చేయబోయే నియోజకవర్గం మారిన అనంతరం.. తమ అనుచరుల ఓట్లను కూడా వారు పోటీ చేసే నియోజకవర్గానికి మార్పించుకుంటున్నారంట! ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు భారీగా తగ్గిపోగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో లెక్కకు మించిపోతున్నాయనే చర్చ మొదలైంది. అయితే... ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిందని తెలుస్తుంది. దీంతో... ఇలాంటివారిపై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం.. చర్యలకు దిగుతోందని అంటున్నారు.
వాస్తవానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం... ఒక నియోజకవర్గంలో శాశ్వత చిరునామా ఉండి అక్కడే నివాసముంటున్నవారు.. మరో నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అనర్హులు! ఈ నిబంధనతో ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇలా ఓట్లు మార్చుకున్న వారి ఓట్లు, తిరిగి వారి వారి సొంత చిరునామాలు ఉన్న నియోజకవర్గాలకు మారుస్తారా.. లేక, అనర్హులుగా ప్రకటించి తొలగిస్తారా అనే చర్చ మొదలైంది!!