Begin typing your search above and press return to search.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..టీడీపీ బాయ్ కాట్?

ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 8:50 AM GMT
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..టీడీపీ బాయ్ కాట్?
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు, జాతీయ స్థాయి నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు బెయిల్, ముందస్తు బెయిల్, సీఐడీ కస్టడీలకు సంబంధించిన పిటిషన్ల విచారణ, తీర్పు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు పలు కీలక బిల్లులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

ఇక, అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ వ్యూహ రచన కమిటీ సభ్యులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ సభ్యులు సభకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలోనే అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు చంద్రబాబు అరెస్టయ్యారు. ఈ క్రమంలో సభ కు వచ్చి టిడిపి సభ్యులు వైసిపి ప్రభుత్వ తీరును ఎండగడతారా లేక సభలను బాయికాట్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా?వద్దా? అనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యి ఈ రోజు నిర్ణయించబోతున్నారని తెలుస్తోంది. సమావేశాలకు హాజరై చంద్రబాబు అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తే బాగుంటుందా లేక సమావేశాలను బాయ్ కాట్ చేస్తే బాగుంటుందా అన్న దానిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకోబోతున్నారట.