151 మంది ఎమ్మెల్యేలలో 40 మంది మాత్రమే అటెండెన్స్...కారణం ఏంది..!?
వైసీపీ బలమైన అధికార పక్షంగా 2019 ఎన్నికల్లో అవతరించింది. ఎటు చూసినా వైసీపీ ఎమ్మెల్యేలా అన్నట్లుగా అసెంబ్లీ నలుదిశలా కనిపించారు
By: Tupaki Desk | 7 Feb 2024 6:02 PM GMTవైసీపీ బలమైన అధికార పక్షంగా 2019 ఎన్నికల్లో అవతరించింది. ఎటు చూసినా వైసీపీ ఎమ్మెల్యేలా అన్నట్లుగా అసెంబ్లీ నలుదిశలా కనిపించారు. వారికి తోడు అన్నట్లుగా ఆ తరువాత టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక్కరు ఎమ్మెల్యేలు వచ్చి అధికార పక్షానికి జై కొట్టారు. ఇలా తల తిప్పి చూస్తే ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనిపించిన దాఖాలాలు లేవు.
అసెంబ్లీ సమావేశం అయితే వైసీపీ ఎమ్మెల్యేలతో కళకళలాడేది. అలాంటిది వైసీపీ ప్రభుత్వం నిర్వహించే చివరి అసెంబ్లీ సెషన్ కి మాత్రం చాలా అంటే చాలా పలుచగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ నంబర్ చూస్తే జస్ట్ నలభై అని అంటున్నారు. ఎక్కడ 151 మంది ఎక్కడ 40 మంది ఎంత తేడా. బిగ్ నంబర్ నుంచి ఈ షాకిచ్చే నంబర్ మాత్రమే అసెంబ్లీలో అధికార పక్షం వైపు కనిపించడం వెనక కారణాలు ఏంటి అన్నదే ఎవరికీ తెలియడంలేదు.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలలో అధికార పక్షం నుంచి పలచగా హాజరు ఉంది. రెండవ రోజు అయిన గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొనే వేళకు వైసీపీ నుంచి కేవలం నలభై మంది మాత్రమే ఎమ్మెల్యేలు సభలో కనిపించడం జరిగింది. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగింది.
అధికార పార్టీ గెలుపు ధీమా ఉన్న పార్టీ ఎన్నికల వేళ నిర్వహించే అఖరు సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగ్గా హాజరు కాకపోవడం అంటే దాని మీద చర్చ ఒక రేంజిలో సాగుతోంది. అయితే వినిపిస్తున్న మ్యాటర్ ఏంటి అంటే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లను అధినాయకత్వం నిరాకరిస్తోంది. అలాగే అనేకమందిని షిఫ్ట్ చేస్తోంది. వారు కోరుకున్న నియోజకవర్గాలు దక్కడంలేదు. మరి కొంతమందిని ఇష్టం ఉన్నా లేకున్నా ఎంపీలుగా పంపుతోంది.
ఇలా చాలా మార్పు చేర్పులు చేయడంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అంతా పూర్తి అయోమయంలో అభద్రతాభావంలో అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది. దాంతో వారు ఈ సభకు ఒక నమస్కారం అన్నట్లుగా అసెంబ్లీకి రావడంలేదు అని అంటున్నారు. నిజానికి ఎపుడూ ఇలా జరగలేదు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశంలో ఎమోషన్స్ తో సెంటిమెంట్ తో సీన్లు పండేవి.
అయిదేళ్ల పాటు కలసి మెలసి పనిచేశామని అంతా తలచుకుని భావోద్వేగం అయ్యేవారు. అప్పటికి ఎవరికి టికెట్లు వస్తాయో రావో కూడా తెలియదు. అయితే జగన్ దానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలకు ముందే చెప్పి చీటీ చించేస్తున్నారు. దాంతో ఎమ్మెల్యేలు చివరి అసెంబ్లీకి కూడా నోచుకోకుండా ముందే మాజీలుగా డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకొచ్చిన అసెంబ్లీ అనుకుంటూ వారు వెళ్ళడం మానుకుంటున్నారు.
దాని ప్రభావమే ఇపుడు అసెంబ్లీ సమావేశాల మీద పడింది అని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా మరిన్ని మార్పుచేర్పులకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దాంతో ఆయన ఎమ్మెల్యేలు ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడంలేదు అని అంటున్నారు. దాంతో కూడా చాలా మంది సభకు వెళ్లడంలేదు అంటున్నారు. సభకు వచ్చినా భయంగానే వచ్చే వారు కనిపిస్తున్నారు. ఈ సభ అయిపోతుంది. మళ్లీ వచ్చే సభకు తాము నెగ్గి రావాలంటే ముందు టికెట్ ఇవ్వాలి కదా అన్నది కూడా అనేక మంది మాటగా ఉంది.
ఏది ఏమైతేనేమి వైసీపీ అధినాయకత్వం ఎవరూ చేయని ప్రయోగం చేయడం చాలా కాలం ముందే ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల చివరికి లాస్ట్ అసెంబ్లీ సెషన్ మాత్రం ఏ కళ కట్టకుండా వెలవెలపోతోంది అని అంటున్నారు. ఇక ఇపుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు అయినా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు హాజరై ఓటు వేస్తారా అన్నదే ఇపుడు పట్టుకున్న టెన్షన్ అని అంటున్నారు.
చూడాలి మరి ఏమి జరుగుతోందో. ఏది ఏమైనా రాజకీయం ఎలా ఉంటుందో ఏపీలో జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. పదవి ఉన్నా లేకపోయినా తాము చివరి రోజు వరకూ ఎమ్మెల్యే అన్న భావన చాలా మంది ప్రజా ప్రతినిధులతో కనిపించకపోవడం ఒకింత బాధాకరమే అంటున్నారు.