Begin typing your search above and press return to search.

ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు జాతీయ పార్టీ!

పార్టీ విధానాలను బలంగా వినిపించాలన్నా.. ప్రజల సమస్యలను గట్టిగా ప్రస్తావించాలన్నా.. ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నా.. సరైన వేదిక అసెంబ్లీ

By:  Tupaki Desk   |   17 Dec 2023 10:02 AM GMT
ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు జాతీయ పార్టీ!
X

పార్టీ విధానాలను బలంగా వినిపించాలన్నా.. ప్రజల సమస్యలను గట్టిగా ప్రస్తావించాలన్నా.. ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నా.. సరైన వేదిక అసెంబ్లీ. బయట మీడియాలో మనం ఎన్ని మాట్లాడినా అది చేరేంతవరకే చేరుతుంది. అత్యధిక శాతం ప్రజలకు చేరాలంటే మాత్రం శాసన సభనే అసలు సిసలు ప్రదేశం. ఆ క్రమంలో పార్టీ శాసన సభా పక్ష నేత (అసెంబ్లీ ప్లోర్ లీడర్) పాత్ర కీలకం. ఈ హోదాలో ఉన్నవారికి సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటే వారు ప్రజా నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పి.జనార్దన్ రెడ్డి ఇలానే అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచారు.

8 మంది గెలిచినా..

ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. ఆరు నెలల కిందటి వరకు అధికారంలోకి వచ్చేస్తున్నంత హడావుడి చేసిన కమలం పార్టీ ఆ తర్వాత చతికిలపడింది. ఎన్నికల్లో కనీస ప్రదర్శన చేస్తుందా? అని ఓ దశలో అనుమానాలు వచ్చాయి. కానీ, 8 సీట్లలో విజయం సాధించింది. ఇది ఆ పార్టీనీ ఆశ్చర్యపరిచి ఉంటుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి బీజేపీ ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్) ముగ్గురూ ఓటమిపాలయ్యారు. వీరిలో ఇద్దరైనా గెలుస్తారన్న అంచనాలుండేవి. దుబ్బాకలోనూ రఘునందన్ రావు విజయం సాధిస్తారని భావించారు. ఇక అన్నిటికంటే సంచలనం.. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఓడించడం. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని ఫలితాలు చాటాయి.

సభా నాయకుడేరి?

బీజేపీకి గత ఎన్నికల్లో మొదట రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. ఆయనే పార్టీ సభా నేతగా వ్యవహరించారు. తర్వాత రఘునందన్, హుజూరాబాద్ లో ఈటల కూడా నెగ్గడంతో బలం మూడుకు పెరిగింది. అయినప్పటికీ రాజాసింగ్ సభా పక్ష నేతగా కొనసాగారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లోనూ రాజాసింగ్ విజయం సాధించారు. ఈయన కాక బీజేపీకి మరో ఏడుగురు సభ్యులున్నారు. అయినప్పటికీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరో తేల్చలేదు.

నాయకుడు లేకుండానే సభకు

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ సభ్యులు హాజరవుతున్నారు. రేవంత్, కేసీఆర్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు అనుభం ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి వారున్నా ఫ్లోర్ లీడర్ ను ప్రకటించలేదు. దీన్ని చూస్తుంటే రాజాసింగ్ కు మళ్లీ అవకాశం ఇచ్చేలా లేదు. వివాదాస్పద వ్యాఖ్యలకు గాను పార్టీ సస్పెన్షన్ కూ గురైన ఆయనను ఈసారి శాసన సభా పక్ష నేతగా కొనసాగించబోరని తెలుస్తోంది.

కేసీఆర్ గాయపడినప్పటికీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసింది బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ సీఎం పదవి అభ్యర్థిని శాసన సభా పక్ష నేతగా ప్రకటిస్తుంది. మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఎలాగూ అక్బరుద్దీన్ ఒవైసీనే. సీపీఐ గెలిచించి ఒక్క సీటే కాబట్టి కూనంనేని ఫ్లోర్ లీడర్ గా ఉంటారు. బీజేపీ మాత్రమే సభా నాయకుడిని ఎంపిక చేయలేదు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను బుధ, గురువారాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పొడిగింపు లేకుంటే, శనివారంతోనే పూర్తయ్యేవి. మరి బుధ, గురువారాల్లో అయినా బీజేపీ ఫ్లోర్ లీడర్ ను ప్రకటిస్తుందేమో చూడాలి.