Begin typing your search above and press return to search.

అయ్యన్న అనుభవం ఇదే!

అవును... ఆంధ్రప్రదేశ్ నూతన శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని, ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 6:22 AM GMT
అయ్యన్న అనుభవం ఇదే!
X

ఆంధప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సాయంత్రం పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు అయ్యన్న పాత్రుడి తరుపున నామినేషన్ దాఖలు చేశారు! ఈ సమయంలో ఒక్క నామినేషనే దాఖలవ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

అవును... ఆంధ్రప్రదేశ్ నూతన శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని, ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లు ఆయనను సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు.

అయ్యన్నపై చంద్రబాబు ప్రశంసల జల్లులు!:

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా... అయ్యన్న కరుడుగట్టిన పసుపు యోధుడని, 42 ఏళ్లుగా పసుపు జెండా మోసిన పోరాట యోధుడని, ఈయన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ అని చంద్రబాబు కొనియాడారు. 42 ఏళ్లుగా ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకున్న వ్యక్తి అని తెలిపారు.

ఇదే సమయంలో నర్సీపట్నం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయన్నపాత్రుడు గత ఐదేల్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా అయ్యన్నాపాత్రుడిపై సుమారు 20కి పైగా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని.. ఇదే సమయంలో ఆయనపై అత్యాచారం కేసు కూడా పెట్టారని, ఇది దారుణం అని అన్నారు!

జగన్ గైర్హాజరుపై భిన్నాభిప్రాయాలు!:

మరోపక్క ఈ రోజు స్పీకర్ ఎన్నిక అని సమాచారం అందించినా వైఎస్ జగన్ గైర్హాజరవ్వడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సభా సంప్రదాయాల ప్రకారం శుక్రవారమే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికార పక్షం చెప్పిందని తెలుస్తుంది. అయినప్పటికీ ఈరోజు జగన్ ఆ కార్యక్రమానికి హాజరవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

ఈ నేపథ్యంలో ఇది సభా సాంప్రదాయం కాదని గైర్హాజరవ్వడం కరెక్ట్ కాదని.. స్పీకర్ ఎన్నిక సమయంలో అధికార పక్ష నాయకుడితో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండటం సంప్రదాయమని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు! అయితే... జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాదని.. కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని.. ఆయన హాజరుకానంత మాత్రాన్న ఏమీ ఇబ్బంది లేదని మరో కామెంట్ వినిపిస్తుంది!

అయ్యన్న అనుభవం ఇదే!:

కాగా... అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడికి నాలుగు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. ఓసారి ఎంపీగా పనిచేశారు. ఈ క్రమంలో పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడుసార్లు గెలిచారు. అదేవిధంగా ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఆయన సొంతం.