Begin typing your search above and press return to search.

ఇరాన్ కు స్వీట్ వార్నింగ్.. చప్పట్లు కొడితే తాట ఊడిపోద్దన్న యూఎస్!

అయితే... ఇజ్రాయెల్‌ పై అక్టోబరు 7నాటి హమాస్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రమేయం ఉందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2023 3:53 AM GMT
ఇరాన్  కు స్వీట్  వార్నింగ్.. చప్పట్లు కొడితే తాట ఊడిపోద్దన్న యూఎస్!
X

ఏదైనా వెదవపని చేస్తే... చేస్తున్నవాడితో పాటు ఆ పని చేస్తున్నవాడిని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసేవాడికి కూడా తాట ఊడిపోద్దనే టైపు హెచ్చరికలు తాజాగా అంతర్జాతీయ వేదికలపై దర్శనమిచ్చాయి! ఇప్పుడు వాటిని స్వీట్ & స్ట్రాంగ్ వార్నింగ్ అని అంటున్నారు. ఈ హెచ్చరిక చేసింది అమెరికా అయితే.. ఆ హెచ్చరిక ఇరాన్ కోసం. ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం నుంచి ఈటైపు వార్నింగ్ తెరపైకి వచ్చింది.

ఇజ్రాయెల్‌ పై హమాస్‌ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. 20 నిమిషాల్లో 5000 రేకెట్లతో దాడి చేశామని గొప్పలు చెప్పుకున్న హమాస్... ఇప్పుడు విలవిల్లాడిపోతోంది. గాజాలోని హమాస్‌ నెట్‌ వర్క్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న భీకర వైమానిక దాడులకు చిగురుటాకులా వణికిపోతోందని తెలుస్తుంది. ఇక గాజాలో సామాన్యుల పరిస్థితి అయితే చెప్పే పనే లేదు!

అయితే... ఇజ్రాయెల్‌ పై అక్టోబరు 7నాటి హమాస్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రమేయం ఉందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇందులో భాగంగా... వెనకా ముందూ ఆలోచించకుండా ఈ యుద్ధాన్ని ఎగదోస్తే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్‌ ను హెచ్చరించారు.

అవును... హమాస్‌ దాడులు ఇరాన్ ప్రమేయం లేకుండా జరిగాయని అంటే.. అది హాస్యాస్పదమే అవుతుందని ఇటీవలి చెప్పిన ఆయన... ఇప్పుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. "ఇరాన్‌ కు ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. మేం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఇజ్రాయెల్‌ - హమాస్ యుద్ధం తీవ్రతరం అయితే.. అది మీ వరకూ వస్తుందని గుర్తుపెట్టుకోండి" అని లిండ్సే గ్రాహం తెలిపారు.

ఇదే సమయంలో... తాను సపోర్ట్ చేసే సంస్థలను ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంలోకి ఇరాన్‌ దింపితే.. ఆ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా పేర్కొంది. అమెరికా.. ఇరాన్ కు ఈ మేరకు ఈస్థాయిలో హెచ్చరికలు చేయడానికి గల ప్రధాన కారణం హిజ్బుల్లా. గాజాలోని హమాస్‌ తోపాటు లెబనాన్‌ లోని హిజ్బుల్లాకు ఇరాన్‌ ప్రధాన మద్దతుదారు.

ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ పై వ్యూహాత్మకంగా హమాస్‌ తో ఇరాన్‌ దాడులు చేయించిందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, హమాస్‌ మిలిటెంట్లు చేసిన దాడిలో ఇరాన్‌ పాత్ర లేదని సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ వివరణ ఇస్తున్నారు. అయినప్పటికీ అగ్రరాజ్యం అనుమానం, నిఘావర్గాల వివరణ మాత్రం అలానే ఉంది. దీంతో... ఇరాన్ ను అమెరికా ఒక కంట కనిపెడుతూనే ఉంది.

మరోపక్క ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం నేపథ్యంలో అమాయక ప్రజలు బలి అవుతున్నారు. అందువల్ల గాజాలో దాడులు ఆపాలని, యుద్ధానికి విరామం ఇవ్వాలని యురోపియన్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. అయితే.. అమెరికా మాత్రం ఈ పిలుపును వ్యతిరేకించింది. యుద్ధానికి విరామం ఇస్తే ప్రజలకంటే హమాస్‌ కే ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించింది.