Begin typing your search above and press return to search.

వందేళ్ళ వాజ్ పేయి : ఆయనొక శకం

అటల్ బిహారీ వాజ్ పేయి ముద్ర ఈ దేశ రాజకీయాల మీద ప్రస్పుటంగా ఉంటుంది. ఆయన రాజకీయాల మీద మక్కువతో రాలేదు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 3:37 AM GMT
వందేళ్ళ వాజ్ పేయి : ఆయనొక శకం
X

అటల్ బిహారీ వాజ్ పేయి ముద్ర ఈ దేశ రాజకీయాల మీద ప్రస్పుటంగా ఉంటుంది. ఆయన రాజకీయాల మీద మక్కువతో రాలేదు. జనం మీద ప్రేమతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందుకే ఆయన చివరి వరకూ ప్రజా నాయకుడిగానే నిలిచారు, వెలిగారు. అటల్ బిహారీ వాజ్ పేయ్ ఈ దేశాన్ని పాలించిన ఉత్తమమైన సేవలు అందించిన ప్రధానుల సరసన తాను కూడా ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఆయన మీద దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభావం కూడా కొంత ఉంది. చాలా మందికి ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ. దాని పూర్వ రూపమైన జనసంఘ్ ని బలోపేతం చేయడంలో అటల్ జీ పాత్ర ఎంతో కీలకమైనది.

ఆయన 1924 డిసెంబర్ 25న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈ ఏడాదితో ఆయనకు వందేళ్ళు. ఆ విధంగా వాజ్ పేయ్ శత జయంతి వేడుకలను బీజేపీతో పాటు ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఉన్న అశేష అభిమానులు జరుపుకుంటున్నారు.

వాజ్ పేయి 15 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సంఘ్ లో చేరారు. 1925లో ఏర్పడిన ఆరెస్సెస్ తో పాటే వాజ్ పేయ్ కూడా కలసి పనిచేశారు. అలా 1951లో ఏర్పాటు అయిన జన సంఘ్ లోనూ ఆయన కీలక పాత్రను పోషించారు. ఆరెస్సెస్ ఆయనను జన సంఘ్ లో పనిచేయడానికి నియమించింది.

1957లో వాజపేయి బల్ రాం పూర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన వాగ్ధాటి మూలంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఆకర్షించారు. దాంతో ఏదో ఒకరోజు వాజపేయి దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు. యువ వాజ్ పేయ్ అంటే నెహ్రూకి అమితాభిమానంగా ఉండేదని చెబుతారు. వాజ్ పేయ్ సభలో ప్రసంగం చేస్తున్నపుడు నెహ్రూ ఎంతో ఆసక్తిగా వినేవారు అంటారు.

వాజ్ పేయి తన రాజకీయ జీవితంలో పదిసార్లు లోక్ సభకు రెండు సార్లు రాజ్యసభకు నెగ్గారు. ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా విలక్షణమైనది. నిర్మాణాత్మకంగా ఉండేది. 1971లో పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో భారత సైన్యం పోరాడి గెలిచింది. ఆ సందర్భంగా ఆమెకు అపర కాళికగా వాజ్ పేయి పోల్చారు.

పార్టీలు వేరు అయినా మంచి దేశానికి జరిగితే ఆయన మెచ్చుకునేవారు. అదే తప్పు జరిగితే సునిశితమైన విమర్శలతో పాలకులకు చెప్పేవారు. అందుకే ఆయన జనం మెచ్చిన నేత మాత్రమే కాదు రాజకీయ జనమంతా పార్టీలకు అతీతంగా మెచ్చిన నేతగా ఉన్నారు. అందరి మన్ననలు అందుకున్నారు.

ఆయనలో కవి ఉన్నారు. ప్రేమికుడు ఉన్నారు. ప్రకృతిని ఆస్వాదించే నేస్తం ఉన్నారు. ప్రాణమిచ్చే స్నేహితుడు ఉన్నారు. అద్వానీది ఆయనది అలాంటి బంధమే. ఆ విధంగా చూసే ఆయన బహుముఖ ప్రతిభాశాలిగా చెప్పాలి. ఆయన కంటే ముందు చాలా మంది ప్రధానులు అయినా వారితో కలసి పనిచేయడానికి విపక్ష పాత్ర పోషించడానికి ఏనాడూ ఆయన వెనకాడలేదు. తన పాత్ర తనది అనుకున్నారు

అలా మూడు తరాలతో అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు ప్రధానులుగా ఉంటే ఆ ముగ్గురితోనూ విపక్ష నేతగా వాజ్ పేయ్ పనిచేయడం ఒక అరుదైన రికార్డుగా చూడాలి. ఇక ఆయనకు డెబ్బై రెండేళ్ళ వయసులో అనంటే 1996లో ప్రధానిగా తొలిసారి అయ్యే చాన్స్ దక్కింది. కానీ బలం లేక 13 రోజులకే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.

తిరిగి 1998లో రెండవసారి అధికారం చేపట్టినా 13 నెలలకే కూలిపోయింది. 1999లో మాత్రం ఆయన పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఎన్డీయే పేరుతో ఏర్పాటు చేసిన కూటమిలో ఆనాడు 25 దాకా పార్టీలను నిభాయించుకుని పాలించడం అంటే వాజ్ పేయి రాజకీయ చతురతగానే అంతా చూసారు.

పాకిస్థాన్ కి ఆయన స్నేహ హస్తం అందించారు. కానీ అటు నుంచి కార్గిల్ రూపంలో వెన్ను పోటు ఎదురైంది. ఇక ఆయన విదేశాంగ విధానం ఎపుడూ భారత్ కి మేలుగానే ఉండేది. దేశంలో అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుకీ గొప్పగా చెప్పుకుంటారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన ప్రభుత్వం పెద్ద పీట వేసింది.

ఇక 1999లో అధికారంలోకి వచ్చినా అయిదేళ్ళూ పూర్తిగా పాలించకుండానే ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్ళిన వాజ్ పేయి దేశం వెలిగిపోతోంది అన్న నినాదంతో ప్రచారం చేశారు. కానీ అది జనం మెచ్చలేదు. 2004 మేలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2005కీ వాజ్ పేయి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయన 2018 ఆగస్టు 16 న ఢిల్లీలో మరణించారు.