"చంద్రబాబు తర్వాత లోకేష్.. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు"!
నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వుడా ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 11:08 AM GMTగత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ తరుపున కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన సీనియర్లు... పార్టీ కేడర్ కు పార్టీలో వారి భవిష్యత్తుపై నమ్మకం కలిగించడానికి, పార్టీ భవిష్యత్తుపై భరోసా నింపడానికి టీడీపీ అధినాయకత్వం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో... మరోసారి చంద్రబాబు తర్వాత టీడీపీకి అన్నీ నారా లోకేషే అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పైగా ఈ విషయంలో పార్టీలో కింది స్థాయి కేడర్ నుంచి పెద్దల వరకూ అంతా ఒకే మాట మీద ఉన్నారనే ప్రచారం బలంగా జరుగుతుంది. పైగా.. లోకేష్ అందుకు పూర్తి అర్హుడని గంటాపథంగా చెబుతున్నారు. ఈ సమయంలో తాజాగా అచ్చెన్నాయుడు స్పందించారు.
అవును... నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వుడా ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు పార్టీ శ్రేణులు. సుమారు 500 మంది రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన అచ్చెన్నాయుడు.. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నాయకత్వం మాత్రమే అని.. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని.. చిన్న పిల్లాడి నిద్ర లేపి అడిగినా, కొట్టి అడిగినా ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్తాడని తెలిపారు. చంద్రబాబు తర్వాత టీడీపీ నాయకుడు ఎవరంటే అర్ధరాత్రి లేపి అడిగినా కళ్లు మూసుకుని నారా లోకేష్ అని చెబుతారని అన్నారు.
ఇక గత కొన్ని రోజులుగా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అంశం మీడియాలోనూ, అటు కూటమి పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... ప్రభుత్వంలో పదవులు, నిర్ణయాలు ఏవైనా కూటమి కలిసి చేస్తుందని.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు, నిర్ణయాలకూ తావు లేదని.. ఈ విషయాలపై తానైనా, ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి విధానం కాదని అచ్చెన్న అన్నారు.
ఇక... ప్రజలకు సేవ చేయాలనే తనపంతోనే నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పిన అచ్చెన్నాయుడు.. ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ కార్యకర్తలే అని అన్నారు. ఇదే విషయాన్ని తమతోనూ చెప్పిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. ఇక.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ చేస్తున్న పనులతో చరిత్ర సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు కొనియాడారు!