అన్న కోరికను అలా తీర్చిన అచ్చెన్న ?
ఆయన దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడుకు తమ్ముడు. అచ్చెన్నాయుడుకు అన్నయ్య.
By: Tupaki Desk | 1 Sep 2024 3:58 AM GMTటీడీపీ సీనియర్ నేత మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు తన అన్న కోరికను తీర్చడం కోసం వివాదంలో చిక్కుకున్నారా అంటే వైరల్ అవుతున్న న్యూస్ ను చూస్తే అవునా అనుకునే విధంగానే ఉంది అంటున్నారు. అచ్చెన్నాయుడు అన్నగా ఉన్న కింజరాపు ప్రభాకర్ నాయుడు పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సర్వీస్ చేసి ఆగస్ట్ 31న పదవీ విరమణ చేశారు. ఆయన దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడుకు తమ్ముడు. అచ్చెన్నాయుడుకు అన్నయ్య.
ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ప్రమోషన్ ఇచ్చారు అన్నది ఇపుడు వివాదాస్పదంగా మారింది. మామూలుగా అయితే డీఎస్పీగానే ప్రభాకర్ నాయుడు రిటైర్ కావాలని అయితే ఆయనను ఏఎస్పీ గా చేసి ప్రమోషన్ ఇచ్చి మరీ రిటైర్ చేయించారు అని ప్రతిపక్షం విమరిశ్తోంది. ప్రభాకర్ నాయుడు ఏఎస్పీ కావాలంటే ఆయన కంటే ముందు మరో ముప్పయి మంది దాక ఉన్నారని అలా ఒకేసారి 32 మందికి ఏఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చి మరీ అన్నయ్య ప్రభాకర్ నాయుడు కోరికను తమ్ముడు మంత్రి అచ్చెన్న తీర్చారు అని విపక్షం అంటోంది.
ఇక ఏస్పీ హోదాలో ప్రభాకర్ నాయుడు రిటైర్ కావడం వల్ల ఆయనకు అదనపు ఆర్ధిక ప్రయోజనాలు సమకూరుతాయని అ విధంగా ఖజానాకు అనవసర వ్యయం అవుతుందని కూడా అంటుంది. దీంతో ప్రభాకర్ నాయుడు ప్రమోషన్ అన్నది ఇపుడు వివాదంగా మారింది. ఇదిలా ఉంటే వైసీపీ అయిదేళ్ల పదవీ కాలంలో ప్రభాకర్ నాయుడుని లూప్ లైన్ లో ఉంచేశారు అని అంటున్నారు.
లేకపోతే ఆయనకు ఏనాడో ప్రమోషన్ వచ్చేది అన్నది ఒక వాదన ఉంది. ఆయన సోదరుడు రాజకీయల్లో ఉంటే ప్రభాకర్ నాయుడుని అలా టార్గెట్ చేశారు అని కూడా అంటున్నారు. అలా జరిగిన అన్యాయాన్ని ఇపుడు సరిదిద్దారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. రాజకీయంగా కీలక పదవులలో కింజరాపు కుటుంబం ఉంది. దాంతోనే ఇపుడు రిటైర్మెంట్ కి ఒక్క రోజు ముందు ప్రమోషన్ అంటే అది అతి పెద్ద చర్చగానే ముందుకు వస్తోంది.
ఇక ప్రభాకర్ నాయుడు పదవీ విరమణ చేశారు. ఫ్రీ బర్డ్ కాబట్టి ఆయన కూడా సోదరుడి బాటలో రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. కింజరాపు సోదరులకు పట్టు ఉన్న సిక్కోలు నుంచి ప్రభాకర్ నాయుడు కూడా వస్తే మొత్తం కుటుంబం వచ్చినట్లు అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.