Begin typing your search above and press return to search.

అధికారులకు మాస్ వార్నింగ్... ఏపీ మంత్రి!

ఈ సమయంలో తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు తదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 8:47 AM GMT
అధికారులకు మాస్  వార్నింగ్... ఏపీ మంత్రి!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తమ తమ శాఖల బాధ్యతలు తీసుకున్న మంత్రులు.. మొదటి నుంచీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో పాలన మొత్తం గాడి తప్పిందని చెబుతూ అధికారులకు తగు సూచనలు కం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు తదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

అవును... ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా... మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... జిల్లా అభివృద్ధికి అంతా కలిసి పనిచేద్దామని సూచించారు. గత ప్రభుత్వంలో తమను కనీసం ప్రజాప్రతినిధులుగా గుర్తించలేదని.. ఫలితంగా జెడ్పీ సమావేశాలకు వచ్చి సమస్యలు చర్చించలేకపోయామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను అధికారులు గౌరవించాలని.. తమ నాయకులకు ఏ ఆఫీసులో అవమానం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని అచ్చెన్న.. అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదే క్రమంలో... ప్రతీవారం గ్రీవెన్స్ ను విధిగా నిర్వహించాలని, గ్రీవెన్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఖరీఫ్ లో రైతులు విత్తనాలకోసం ఇబ్బంది పడకూడదని, రైతులు ఎక్కడైనా ఇబ్బంది పడినా సంబంధిత అధికారులదే బాధ్యత అని మంత్రి తెలిపారు. అదేవిధంగా... రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు సరఫరా చేయటానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

ప్రధానంగా వంశధార శివారు ఆయుకట్టుకు నీరు అందించాలని సూచించిన మంత్రి అచ్చెన్న... తక్షణమే వంశధార అధికారులు కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని అన్నారు. ఇదే సమయంలో వారం రోజులోగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.