అమెరికాలో మరో ఘటన... ఆలస్యంగా వెలుగులోకి ఘోర సంఘటన!
అమెరికాలో దాడుల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2024 1:45 PM GMTగతకొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతి వారు వరుసగా దాడుల బారిన పడటం, వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదారు ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా జరిగిన గొడవలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు.
అవును... అమెరికాలో దాడుల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదారు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన వీధి గొడవలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. గుర్తు తెలియని దుండగుడి చేతిలో అతను హతుడైనట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా ప్రభుత్వానికి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న టెక్నాలజీ సొల్యూషన్స్, అనలైటిక్ ప్రొడక్ట్ ప్రొవైడర్ "డైనమో టెక్నాలజీస్" సహ వ్యవస్థాపకుడు వివేక్ తనేజా(41) వర్జీనియాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2న ఓ రెస్టారెంటుకు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆయన వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో చిన్నపాటి గొడవ మొదలైంది.
ఇంతలో ఏమైందో ఏమో కానీ అలా చిన్నగా స్టార్ట్ అయిన గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. దీంతో ఆ దుండగుడు వివేక్ తనేజాపై దాడి చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఆయనపై విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. దీంతో వివేక్ తలకు తీవ్రంగా గాయమవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
అప్పటికే నెత్తుటి మడుగులో పడిఉన్న వివేక్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ తెలిపిన వారికి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. ఇదే సమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.