ఎట్ హోం. : ఆయన రాలేదు... ఆమె వచ్చారు!
గతంలో అయితే ఇది చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా సాగుతూ వచ్చేది. ప్రభుత్వ అధినేత ప్రతిపక్ష నేతల మధ్య సందడిగా సాగేది
By: Tupaki Desk | 15 Aug 2024 2:00 PM GMTఎట్ హోం అన్నది స్వాతంత్ర దినోత్సవం వేళ గవర్నర్ రాజ్ భవన్ లో ప్రభుత్వ అధినేతలు, ప్రతిపక్ష నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక సేవకులు ఉన్నతాధికారులు ఇలా అన్ని వర్గాలని పిలిచి ఇచ్చే తేనీటి విందు కార్యక్రమం. ఇది ఆనవాయితీగా సాగుతూ వస్తోంది.
గతంలో అయితే ఇది చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా సాగుతూ వచ్చేది. ప్రభుత్వ అధినేత ప్రతిపక్ష నేతల మధ్య సందడిగా సాగేది. ఒకరిని ఒకరు పలకరించుకోవడం, రాజకీయాలకు అతీతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం జరిగేది.
కానీ ఇటీవల కాలంలో ఆ ధోరణి మారింది. అధికార విపక్షాల మధ్య ఘర్షణాత్మక మైన వైఖరి ఇక్కడ కూడా ప్రతిబింబిస్తోంది. అధికార పక్షం వస్తే విపక్షం రావడం లేదు. గత ఐదేళ్ళలో చూస్తే సీఎం హోదాలో జగన్ సతీసమేతంగా ఎట్ హోం కి వచ్చారు. ఆనాటి విపక్ష నేత చంద్రబాబు ఒకటి రెండు సార్లు ఎట్ హోం కి హాజరైనా ఇద్దరూ మాట్లాడుకునేది లేదు.
ఈసారి చూస్తే ఒక్క వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు అన్నీ హాజరయ్యాయి. నాలుగవ సారి సీఎం అయిన తరువాత తొలిసారి ఎట్ హోం కి చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి ఎట్ హోం కి వచ్చారు ఇక కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఎట్ హోం కి ఫస్ట్ టైం రావడం విశేషం.
అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎట్ హోం కి హాజరై చంద్రబాబును కలసి మాట్లాడారు కూడా. వైఎస్ షర్మిల నారా లోకేష్ మాట్లాడుకోవడం ఎట్ హోం లో ఈసారి ప్రత్యేకత. ఇక జగన్ ఈసారి ఎట్ హోం లో కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం వెళ్ళింది కానీ రాలేదు.
సీఎం గా ఎట్ హోం కి వచ్చిన జగన్ విపక్షంలోకి మారగానే దూరం అయ్యారని అంటున్నారు. గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా విపక్ష నేతగా జగన్ ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఏపీకి ఒకరే గవర్నర్ గా ఉండేవారు. అలా నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో హైదరాబాద్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ఒకసారి విపక్ష నేతగా జగన్ హాజరయ్యారు. అప్పుడు చంద్రబాబు సీఎం గా ఎట్ హోం కి వచ్చారు. అపుడు ఇద్దరు నేతలు పలకరించుకున్నారు. అదొక్కటి తప్పించి బాబు జగన్ ఎట్ హోం లో కలసి పలకరించుకున్నది లేదు జగన్ సైతం విపక్ష హోదాలో ఆ ఒక్క సందర్భం తప్పించి వచ్చింది లేదు అని కూడా అంటారు.
ఎట్ హోం అన్నది ఒక చక్కని సంప్రదాయం. రాజకీయాలకు అతీతమైనది అంతా కలసి దేశం గురించి రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఎవరు ఏ పాత్ర పోషించాలి అన్నది నెమరు వేసుకునేది. ఏది ఏమైనా ఏపీలో ఎట్ హోం అంతే ఎపుడూ ఇంతే అన్నట్లుగానే ఉంటోంది. ఈసారి జగన్ రాకపోవడం ఒక లోటు అయితే వైఎస్ షర్మిల రావడం హైలెట్ అని అంటున్నారు. ఆమె లోకేష్ తో మాట్లాడడమూ మరో విశేషం అని అంటున్నారు