ఆ సీఎం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? అఫిడవిట్‌లో కీలక అంశాలు
ఇదిలా ఉండగా.. మంగళవారం ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందజేశారు.
By: Tupaki Desk | 15 Jan 2025 7:30 AM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే నువ్వా నేనా అన్నట్లుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు పెంచారు. రెండు పార్టీలు కూడా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతోనే తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతున్న బీజేపీ.. ఈసారి చాన్స్ మిస్ చేసుకోవద్దనే టార్గెట్‌తో ఉన్నది.
ఇదిలా ఉండగా.. మంగళవారం ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందజేశారు. ఈ అఫిడవిట్ ప్రకారం.. అతిషి మొత్తం ఆస్తుల విలువ రూ.76.93 లక్షలుగా ఉంది. అతిషి సంపద గత ఐదేళ్లలో 28.66 శాతం పెరిగిందని, ఆమెకు సొంత కారు లేదా మరే ఇతర వాహనం కూడా లేదని పేర్కొన్నారు. ఎలాంటి స్థిరాస్తి కానీ.. బంగ్లా, ఫ్లాట్ కానీ లేవని తెలిపారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
తన వద్ద రూ.30వేల నగదు ఉందని, మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అతిషి తెలిపారు. ఫ్లైఓవర్ మార్కెట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ కాలనీ బ్రాంచ్‌లోని పొదువు ఖాతాలో రూ.19,93,512, ఎఫ్‌డీలో రూ.32,85,459 ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే.. ఐసీఐసీఐ బ్యాంక్ భోగల్ బ్రాంచ్‌లోని పొదుపు ఖాతాలో రూ.15,10,790, ఎఫ్‌డీలో రూ.7,53,613 ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన కల్కాజీ మెయిన్‌రోడ్ బ్రాంచ్ సేవింగ్స్ ఖాతాలో రూ.20 వేలు ఉన్నట్లు వెల్లడించారు.
2020లో అతిషిపై క్రిమినల్ పరువు నష్టం కేసు పెండింగులో ఉంది. ఇప్పుడు మరో కేసు కూడా నమోదైంది. అతిషిపై మొదటి క్రిమినల్ కేసు 2019లో నమోదైంది.. 2024లో రెండో కేసు నమోదైంది. అయితే.. ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి శిక్ష మాత్రం పడలేదు. అతిషి తన పూర్తిపేరును అతిషి మర్లెనా అని రాసుకొచ్చారు. ఇంతకుముందు కూడా ఆమెను అదే పేరుతో పిలిచేవారు. ఇటీవల అతిషి అని పిలుస్తున్నారు. ఆమె ఇంటి పేరుపై వివాదం నెలకొనడంతో ప్రతిపక్షాలు దానిపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2020లో ఆమె తాను త్రిప్తా వాహి కుమార్తె అని రాశారు. జంగ్‌పురా ఎక్స్‌టెన్షన్ చిరునామాను ఇచ్చారు. ఈసారి మాత్రం తాను విజయ్‌కుమార్ సిన్హా కుమార్తెగా రాసి.. కల్కాజీ చిరుమానాను ఇచ్చారు. గత ఎన్నికల్లో జీవిత భాగస్వామి కాలంలో అతిషి ప్రవీణ్ సింగ్ పేరును సమ్పించారు. ఈసారి మాత్రం అందులో ‘నిల్’ అని రాయడం గమనార్హం.