Begin typing your search above and press return to search.

సీఎంగా ఆతిశీనే ఎందుకు? ఆమే బ్యాగ్రౌండ్ ఏంటి?

రోటీన్ కు భిన్నమైన రాజకీయాలు చేయటం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అలవాటే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 11:17 AM GMT
సీఎంగా ఆతిశీనే ఎందుకు? ఆమే బ్యాగ్రౌండ్ ఏంటి?
X

రోటీన్ కు భిన్నమైన రాజకీయాలు చేయటం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అలవాటే. అంచనాలకు భిన్నంగా.. ఊహించని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణయంతో మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి మీదనైనా ఆరోపణలు వచ్చి.. జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఆ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. కానీ.. ఢిల్లీ లిక్కరర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లాల్సి వచ్చిన వేళలో ఆయన అందరూ అంచనా వేసినట్లుగా సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైల్లో ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. కోర్టులో బెయిల్ కోసం పోరాడారు.

వారాలు కాస్తా.. నెలలు గడిచిన తర్వాత బెయిల్ మీద జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన అనూహ్య ప్రకటన చేశారు. తాను తన నిజాయితీని నిరూపించుకునే వరకు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టబోనని చెప్పటమేకాదు.. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించి సంచలనంగా మారారు. ఎన్నికలతో ప్రజాభిప్రాయం కోసం వెళతామని.. మళ్లీ విజయం సాధించిన తర్వాతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు.

ఇక.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లీనా సింగ్ గా ఎంపిక చేశారు. ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో ఆమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మాటలతో ప్రతిపక్షాల్ని ముప్పతిప్పలు పెట్టటంలో ఆమె టాలెంట్ ఓ లెవల్ లో ఉంటుందని చెబుతారు. ఉన్నత విద్యావంతురాలు మాత్రమే కాదు.. పార్టీ కష్టకాలంలో అన్నీ తానై నిలిచింది. కేజ్రీవాల్ కు అండగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీపై ప్రతిపక్షాల దాడుల్ని సమర్థంగా ఎన్నుకున్న సామర్థ్యం ఆమె సొంతం.

హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు వంద మిలియన్ గ్యాలెన్ల నీటిని విడుదల చేయలేదంటూ జూన్ లో నిరాహారదీక్ష చేసేందుకు వెనుకాడని తెగింపు ఆమె సొంతం. అయితే.. ఆరోగ్యం క్షీణించటంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. పార్టీ మొత్తంలో ఆతిశీ ఉన్నత విద్యావంతురాలు. గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం మీద పని చేశారు. ఎన్నో ఎన్జీవోలతో కలిసి పని చేసిన అనుభవం ఆమె సొంతం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె.. తల్లిదండ్రులకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైనా.. వెనక్కి తగ్గక రెండో మారు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆతిశీకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆమె 1981 జూన్ 8న పుట్టారు. ఆమె పూర్తి పేరు చూసినప్పుడు మార్లీనా అన్న పేరు కనిపిస్తుంది. ఎందుకిలా? అంటే.. ఆసక్తికర విషయాన్ని చెబుతారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్త వాహి ప్రొఫెసర్లు. వారు కార్ల్ మార్స్క్.. లెనిన్ పేర్లలో కొంత భాగాన్ని తీసుకొని మార్లీనాగా పేరు మార్చారు. 2018 ఎన్నికలకు ముందు నుంచి ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు.

2003లో ఆక్స్ ఫర్డ్ నుంచి హిస్టరీలో మాస్టర్స్ చేసిన ఆమెకు 2005లో రోడ్స్ స్కాలర్ షిప్ లభించింది. ఢిల్లీలోని సెయింట్స్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమ్ ఆద్మీలో చేరటానికి ముందు ఏడేళ్లు మధ్యప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం మీద పని చేశారు. 2015లో మధ్యప్రదేశ్ లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహ్ లో పాల్గొన్నారు. అప్పుడే ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులతో పరిచయం ఏర్పడింది. పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకున్నారు.

పార్టీలో సభ్యురాలు అయ్యాక 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. తొలినాళ్లలో పాలసీ తయారీలో కీలకభూమిక పోషించారు. అటు పట్టణ ప్రాంతం వారు.. ఇటు మధ్యతరగతి వారిని ఆకట్టుకునే సత్తా ఆమె సొంతం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు సన్నిహితంగా ఉన్న వారంతా అరెస్టు అయ్యారు ఆతిశీ ఒక్కరు తప్ప. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం కరవైంది. ఆ టైంలో కూడా ఆతిశీ పేరు చర్చకు వచ్చినా.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని కేజ్రీవాల్ నిర్ణయించుకోవటం తెలిసిందే.

పార్టీకి అన్నీ తానైన ఆతిశీ.. పార్టీకి చెందిన మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ తో కలిసి పార్టీని నడిపారు. 2015-18 వరకు అప్పటి విద్యాశాఖా మంత్రి మనీశ్ సిసోదియాకు సలహాదారు హోదాలో విద్యాశాఖను చూశారు. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశ పెట్టిన హ్యాపీనెస్ కరికులం.. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కరికులం అందరిని ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాల మీద ఫోకస్ చేయటం.. వారిలోని పలు స్కిల్స్ పెంపొందించే అంశం మీదా ఫోకస్ చేశారు.

తర్వాతి కాలంలో విద్యాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఆమె.. మంత్రి హోదాలో తీసుకునే ప్రతి విద్యా సంస్కరణను పార్టీ ఎన్నికల ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసుకోవటం గమనార్హం. కీలక మంత్రులు మనీశ్ సిసోదియా.. సత్యేంద్రజైన్ అరెస్టు అయి జైళ్లకు వెళ్లటంతో ఆమె మీద 14 శాఖలు చూడాల్సిన భారం పడింది. అయినప్పటికీ.. వాటిని జాగ్రత్తగా సమన్వయం చేసుకోవటం ఆమెలో కనిపిస్తుంది.

2019లో ఎంపీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద పోటీచేసిన ఆమె 4.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోగా.. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాలుగేళ్లు తిరిగేసరికి పార్టీకి కీలకంగా మారి.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తనను ఎంపిక చేసిన వైనంపై స్పందించిన ఆమె.. ఇలాంటివి ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యమని పేర్కొన్నారు. తనలాంటి వారికి వేరే పార్టీలో అయితే టికెట్ కూడా ఇచ్చే వారు కాదని.. కానీ తనను నమ్మిఎమ్మెల్యేను.. మంత్రిని చేశారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యతలు ఇచ్చారని పేర్కొన్నారు.

‘కేజ్రీవాల్ ను ప్రజలు తిరిగి ఎన్నుకుంటారు. ఆయన ఎంత నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. ఢిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ సీఎంను చేస్తారు. అప్పటివరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తాను. నాకు శుభాకాంక్షలు.. పూలదండలు వద్దు. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు.. తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకుంటే మహిళలకు ఉచిత బస్సు.. మొహల్లా క్లినిక్.. ఉచిత వైద్యం ఉండవు’’ అని వ్యాఖ్యానించారు.