రామాయణంలో భరతుడిలా.. సీఎంగా ఆతిశీ బాధ్యతలు
దేశంలో ఇప్పటివరకు 16 మంది మహిళలు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
By: Tupaki Desk | 23 Sep 2024 2:30 PM GMTదేశంలో ఇప్పటివరకు 16 మంది మహిళలు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీరిలో రబ్రీదేవి నుంచి మాయావతి, జయలలిత వరకు ఎందరో కీలక నాయకులుగా వ్యవహరించారు. మెహబూబా ముఫ్తీ సైతం కశ్మీర్ సీఎంగా పనిచేశారు. ఉమా భారతి కొద్ది కాలమే అయినా 20 ఏళ్ల కిందటనే మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు 17వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ ఢిల్లీ పీఠంపై కూర్చున్నారు. ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయి జైలు జీవితం గడిపి వచ్చిన కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్లోకి ఆతిశీ వచ్చారు. పార్టీకి ఎంతో విధేయురాలైన ఆమె తన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆతిశీ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయం అవుతోంది.
భరతుడిలా.. అన్నపై గౌరవంతో..
రాజ్యానికి రాజుగా నియమితుడైనా.. రామాయణంలో భరతుడు అన్న శ్రీరాముడి పాదుకలను పీఠంపై ఉంచి పాలన సాగించాడు. ఇప్పుడు సీఎం ఆతిశీ తన కుర్చీ పక్కన కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచి పదవీ బాధ్యతలు చేపట్టారు. కేజ్రీపై తనకున్న గౌరవాన్ని ఈ విధంగా చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చుని బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో రామాయణంలోని ఓ సందర్భాన్ని కూడా ప్రస్తావించారు. నేనిప్పుడు రామాయణంలో భరతుడిలాంటి పరిస్థితుల్లోనే ఉన్నా. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు పాలన సాగించారు. కానీ, సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలారు. ఈ కుర్చీ కేజ్రీవాల్ ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ ఆయన అధికారం చేపడతారని నమ్ముతున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుందని కూడా ప్రకటించారు.
అంటే మళ్లీ కేజ్రీనేనా?
ఢిల్లీ శాసన సభకు వచ్చే ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను కూడా కలిపి నవంబరులో నిర్వహిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆతిశీ మహా అయితే 2 నెలలు సీఎంగా ఉంటారు. లేదంటే ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. అటు కేజ్రీవాల్ కూడా తాను ప్రజల తీర్పు కోరి మరోసారి సీఎం అవుతానని ప్రకటించారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కేజ్రీనే సీఎం అవుతారని తెలుస్తోంది. ఆతిశీకి సీఎంగా అవకాశం ఉండదని స్పష్టం అవుతోంది.
కొత్త మంత్రులతో..
ఆతిశీ సారథ్యంలోని ఆప్ కొత్త ప్రభుత్వంలో.. తొలిసారి ఎమ్మెల్యేలు ముకేశ్ అహ్లావత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు కేజ్రీ సీఎం కుర్చీపై కూర్చోనని ప్రకటించిన సంగతి ఆప్ నేత భరద్వాజ్ గతంలో గుర్తుచేశారు. ఎన్నికల వరకు తమలో ఒకరు కుర్చీలో కూర్చుంటారని.. రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో అలానే చేస్తామని ప్రకటించారు.