Begin typing your search above and press return to search.

వయసు 24... విదేశాలపై మోజుతో 67గా మారింది!

అది రైటా, రాంగా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... దీనికోసం పలువురు చేసే పనులే విచిత్రంగా ఉంటుంటాయి.

By:  Tupaki Desk   |   20 Jun 2024 6:44 AM GMT
వయసు 24... విదేశాలపై మోజుతో 67గా మారింది!
X

భారతదేశంలో నేటి యువతరం విదేశాలపై ఎక్కువగా మోజు చూపిస్తున్నారని అంటుంటారు. చాలా మంది యువత విదేశాలకు వెళ్లాలని, బాగా డబ్బులు సంపాదించి తిరిగి ఊరికి రావాలని అనుకుంటే.. మరికొంతమంది మాత్రం అక్కడే స్థిరపడిపోవాలని భావిస్తుంటారు. అది రైటా, రాంగా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... దీనికోసం పలువురు చేసే పనులే విచిత్రంగా ఉంటుంటాయి.

అవును... విదేశాలకు వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకున్న చాలా మంది సక్రమంగా ప్రయత్నాలు చేస్తే సాఫీగా వెళ్తుంటారు. ఇదే సమయంలో అక్రమంగా వెళ్లాలనుకున్నవారు మాత్రం చిక్కుల్లో పడుతుంటారు. ఇలాంటి వారు విదేశాల్లో విమానం దిగిన అనంతరం, రిటన్ ఫ్లైట్ లో కూడా వెనక్కి పంపబడినవారు చాలా మందే ఉన్నారని అంటుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు విదేశాలకు వెళ్లలనే ఆతృతతో "గెటప్" మొత్తం మార్చేశాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం! జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్ - 3 చెక్ ఇన్ వద్ద ఒక వృద్ధుడిని అనుమానంతో విచారించారు అధికారులు.

ఈ సమయంలో తన పేరు రిష్విందర్ సింగ్ సహోటా అని.. తాను ఫిబ్రవరి 10 - 1957లో జన్మించినట్లు అధికారులకు తెలిపారు. ఇదే సమయంలో ఎయిర్ కెనడా విమానంలో కెనడాకు వెళ్తున్నట్లు తెలిపారు. అయితే... అతని పాస్ పోర్ట్ ను పరిశీలించగా... దానిలోని వివరాలు, అతని రూపం పూర్తి భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని విచారణ అధికారులు గుర్తించారు.

దీంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చెకింగ్ పాయింట్ కు తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో అతని మొబైల్ ఫోన్ ను పరిశీలించగా జూన్ 10 - 2000లో జన్మించాడని.. అతని పేరు గురు సేవక్ సింగ్ అని గుర్తించారంట. ఇదే సమయంలో ఈ వివరాలతో మరో పాస్ పోర్ట్ సాఫ్ట్ కాపీని గుర్తించారంట అధికారులు. దీంతో అతడి అసలు పేరు గురుసేవక్ సింగ్, వయసు 24 అని తేలిందంట.

ఈ సమయంలో చేసేది ఏమీ లేక తప్పును అంగీకరించాడంట గురుసేవక్ సింగ్. తాను 67ఏళ్ల వ్యక్తి సహోటా పేరుతో ఉన్న పాస్ పోర్ట్ పై ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడట. దీంతో... విచారణ అనంతరం అధికారులు ఆ యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారని తెలుస్తుంది. ఇలా 24 ఏళ్ల వయసులో 67ఏళ్ల వ్యక్తిలా రూపం మార్చుకుని కెనడా వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.