Begin typing your search above and press return to search.

వీడియో వైరల్... మణికొండలోని మహిళపై 15 కుక్కలు దాడి!

ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు అప్పడు అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు!

By:  Tupaki Desk   |   22 Jun 2024 12:00 PM GMT
వీడియో వైరల్... మణికొండలోని మహిళపై 15 కుక్కలు దాడి!
X

గతకొంతకాలంగా హైదరాబాద్ లో వీది కుక్కలు చేస్తున్న స్వైర విహారం వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఆన్ లైన్ వేదికగా ఈ విషయంపై పెద్ద యుద్ధమే జరిగింది. ప్రధానంగా జీ.హెచ్.ఎం.సీ. మేయర్ ని టార్గెట్ చేస్తూ ఈ విషయంపై నెట్టింట చిన్న సైజు యుద్ధమే జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు అప్పడు అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు!

కట్ చేస్తే... తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి.. పెద్దలు మారారు.. అధికారులూ మారారు.. కానీ, వీధి కుక్కల దాడులు మాత్రం మారలేదు.. ఆ వీధి కుక్కల దాడులకు బలవుతున్న హైదారాబాదీల పరిస్థితీ మారలేదు! గతంలో ఎంతో మంది పిల్లలకు గాయాలే కాదు మరణాలు కూడా సంభవించడానికి కారణమైన వీది కుక్కల ఘటనల సరసన తాజాగా మరో వ్యవహారం చోటు చేసుకుంది.

అవును... హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయనేది తెలిసిన విషయమే. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా.. ఈ సమస్యకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు! ఈ క్రమంలో తాజాగా మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒంటరిగా రోడ్డుపై వెళ్తోన్న మహిళపై ఒక్కసారిగా సుమారు 15 కుక్కలు విరుచుకుపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా మణికొండలోని చిత్రపురి హిల్స్ వద్ద ఓ మహిళపై సుమారు 15 కుక్కలు దాడి చేశాయి. ఆమె వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అదిరించి బెదిరించే ప్రయత్నం చేసే కొద్దీ అవి రెచ్చిపోయి మీదకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా స్పందిస్తున్న స్థానిక నెటిజన్లు... ఈ ప్రాంతంలో వీధి కుక్కలు ఇప్పటికే చాలా మంది పిల్లలపై దాడులు చేశాయని.. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ అధికారులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ ఆన్ లైన్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ అధికారుల్లో కదలిక రావాలని కోరుకుంటున్నారు!