Begin typing your search above and press return to search.

రీల్ కాదు రియల్: ఆస్తి కోసం సుపారీ ఇచ్చి తండ్రిని చంపించాడు

అసలేం జరిగింది? హత్యకు కారణం ఏమిటి? అన్న వివరాల్ని శంషాబాద్ డీసీపీ రాజేష్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.

By:  Tupaki Desk   |   14 July 2024 2:45 AM GMT
రీల్ కాదు రియల్: ఆస్తి కోసం సుపారీ ఇచ్చి తండ్రిని చంపించాడు
X

మూడు రోజుల క్రితం షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన రియల్టర్ కమ్మరి క్రిష్ణకు సంబంధించి మిస్టరీని పోలీసులు చేధించారు. దీంతో.. షాకింగ్ నిజం వెలుగు చూసింది. కోట్లాది రూపాయిల ఆస్తి కోసం కన్నతండ్రిని హత్య చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని వైనం వెలుగు చూసింది. రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ క్రైం స్టోరీ ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తోంది. సంచలనంగా మారిన రియల్టర్ హత్య కేసును చేధించిన సైబరాబాద్ పోలీసులు.. హత్యకు కారణమైన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారి తీసిన కారణాలు వెలుగు చూశాయి. అసలేం జరిగింది? హత్యకు కారణం ఏమిటి? అన్న వివరాల్ని శంషాబాద్ డీసీపీ రాజేష్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.

పెళ్లైన తర్వాత మొదటి భార్యను.. ఆమె పిల్లల్ని పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి క్రిష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె మరణించిన నేపథ్యంలో మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య పావనికి పదహారు నెలల కుమార్తె ఉంది. ఆమె పేరు మీద దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మొదటి భార్య కొడుకు రగిలిపోయాడు. ఇలానే వదిలేస్తే.. తన తండ్రి ఆస్తి మొత్తాన్ని పావనికి రాసేస్తాడన్న ఉద్దేశంతో తన తండ్రిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.

ఇందుకు క్రిష్ణ వద్ద పని చేసే గార్డు బాబా శివానంద్ అలియాస్ బాబాకు రూ.25 క్యాష్.. ఒక ఇల్లు రాసిస్తానని ఆశ చూపాడు. దీంతో అంగీకరించిన బాబా రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఈ నెల పదిన క్రిష్ణ మర్డర్ కు ప్లాన్ చేశాడు. తనతో పాటు గణేష్.. మరో మైనర్ బాలుడ్ని తీసుకొని కమ్మరి క్రిష్ణ ఉన్న ఫామ్ హౌస్ కు చేరుకున్నాడు. గణేశ్.. మైనర్ బాలుడు క్రిష్ణ చేతులు వెనక్కి పట్టుకోగా.. బాబా తనతో తెచ్చుకున్న కత్తిని గొంతులోకోసి.. పొట్టలో పొడిచి పరారయ్యాడు.

తీవ్రమైన నొప్పితో పెద్ద ఎత్తున అరవగా.. ఇంటి పై అంతస్తులో ఉన్న అతడి భార్య వచ్చి శంషాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే క్రిష్ణ మరణించినట్లుగా అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో.. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు క్రిష్ణకు అంగరక్షకుడిగా పని చేసిన బాబాను.. అతడికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి మూడు కత్తులు.. రెండు కార్లు.. ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో క్రిష్ణను చంపేందుకు అతడి మొదటి భార్య కొడుకే తనతో సుపారీ మాట్లాడుకొని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు వెనుకాడని కొడుకు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.