దైవదర్శనం కోసం వస్తే సామూహిక అత్యాచారం.. దేవుడా?
దారుణ నేరం వెలుగు చూసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆరాచక ఘటన చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 31 March 2025 6:30 AMదారుణ నేరం వెలుగు చూసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆరాచక ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన మహిళపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం వెలుగు చూసింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి చేసి.. అతడ్ని బంధించి.. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయానికి మొక్కులు తీర్చుకోవటానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాధితురాలు బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు.
దైవదర్శనం అనంతరం ఆ రాత్రి అక్కడే నిద్రపోవాలని భావించారు. దైవసన్నిధిలో నిద్ర చేస్తే సమస్యలు తీరతాయన్న నమ్మకం గురించి తెలిసిందే. ఈ క్రమంలో సదరు యువతి కాలక్రత్యాలు తీర్చుకోవటం కోసం సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ మాటు వేసిన యువకులు ఆమెను అటకాయించారు.
ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ దారుణ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు ఎనిమిది మంది ఊర్కొండపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపులు చేపట్టారు. అదుపులో ఉన్న ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.