కేసీఆర్ వియ్యంకుడిపై అట్రాసిటీ కేసు.. విషయం ఏంటంటే!
కాగా, నిజామాబాద్ పోలీసులు కేసీఆర్ వియ్యంకుడిపై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 12:29 PM GMTబీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు రాం కిషన్‌రావుపై తీవ్రమైన కేసు నమోదైంది. ఆయనపై నిజామాబాద్ రూరల్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. రాం కిషన్ రావుతోపాటు.. ఆయన అనుచరులు.. కొండూరు నగేష్, ఎస్. రవిపై కూడా.. ఇదే కేసులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. రాంకిషన్‌రావు.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు స్వయానా మామగారు కావడం గమనార్హం. అంటే.. కేసీఆర్‌కు స్వయానా ఆయన వియ్యంకుడు.
ఏం జరిగింది?
నిజామాబాద్ గ్రామీణ పరిధిలో బైపాస్‌ను ఆనుకుని ఉన్న ఓ అపార్టు మెంటు వద్ద.. 235 గజాల ఖరీదైన స్థలాన్ని రాం కిషన్, ఆయన అనుచురులు.. నగేష్, రవిలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాన వివాదం. దీనికి సంబంధించి అపార్ట్‌మెంటు వాసి.. గోపి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎప్పుడో జరిగింది. అయితే.. తమపై కేసు పెట్టిన గోపీని రాం కిషన్ సహా.. ఆయన అనుచరులు చంపేస్తా మంటూ బెదిరించారని.. బాధితుడు మరోసారి పోలీసులను ఆశ్రయించాడు.
అయితే.. రాం కిషన్ అనుచరుడు నగేష్ మాత్రం అసలు ఆ స్థలం తమదేనని.. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని.. ఈ విషయంలో రాం కిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వివరణ ఇచ్చారు. అసలు అపార్టు మెంటు వాసులే తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నగేష్ ఆరోపించారు. అయితే.. గోపి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు( బెదిరింపులు, చంపేస్తామని హెచ్చరించడం) మేరకు నిజామాబాద్ పోలీసులు ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం గమనార్హం.
బీఆర్ ఎస్ ఫైర్
కాగా, నిజామాబాద్ పోలీసులు కేసీఆర్ వియ్యంకుడిపై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు. బీజేపీ నేతల కళ్లలో ఆనందం చూసేందుకు.. పోలీసులు ఇలా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. అసలు ఏమీ జరగకుండానే.. కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.