Begin typing your search above and press return to search.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై కేసు... కారణం ఇదే!

ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పీఎన్‌ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   14 May 2024 9:22 AM GMT
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  పై కేసు... కారణం ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో పలు అవాంఛనీయ ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల కత్తులతో దాడులు, మరికొన్ని కర్రలతో దాడులు, ఇంకొన్ని చోట్ల చెంపదెబ్బలు ఇలా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో భాగంగా... డొన్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిపై జరిగిన దాడిలో బుగ్గన రాజేంద్రనాథ్ పై కేసు నమోదైంది.

అవును... రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా పలు అవాంఛనీయ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు, రాయచోటి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల, శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, ప్రకాశం జిల్లా గిద్దలూరు, తెనాలి, పల్నాడు మొదలైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, డోన్‌ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పీఎన్‌ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఇదే సమయంలో... తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్‌ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో... బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు నగర పంచాయతీ ఛైర్మన్‌ చలంరెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, నాగరాజు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు!

మరోపక్క తెనాలి చెంపదెబ్బల ఘటనలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో... వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని తెలుస్తుంది. పోలింగ్‌ సందర్భంగా చాపాడు మండలంలో జరిగిన గొడవలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో ఈ కేసు నమోదైంది.