రామరాజ్యం ఆర్మీ...మ్యాటర్ చాలానే !
దీంతో రామరాజ్యం ఆర్మీ అన్నది ఒక్కసారిగా బయటకు వచ్చింది. అసలు ఎవరీ రాఘవరెడ్డి, ఏమా రామరాజ్యం ఆర్మీ అంటే చాలానే మ్యాటర్ ఉంది మరి.
By: Tupaki Desk | 11 Feb 2025 7:58 AM GMTతెలంగాణా రాష్ట్రం లోని ప్రసిద్ధ దేవాలయం చిలుకూరు బాలాజీకి చెందిన బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై ఈ నెల 7వ తేదీన ఒక దాడి జరిగింది. దాంతో ఆధ్యాత్మిక ప్రపంచంతో పాటు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఎందుకు జరిగింది ఏమి జరిగింది అన్నది ఆరా తీశారు.
ఇక జరిగిన దాడికి సంబంధించి మొదట్లో కొందరికి తాజాగా మరో ఐదుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి కారణమైన ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డిని ముందుగానే అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. దీంతో రామరాజ్యం ఆర్మీ అన్నది ఒక్కసారిగా బయటకు వచ్చింది. అసలు ఎవరీ రాఘవరెడ్డి, ఏమా రామరాజ్యం ఆర్మీ అంటే చాలానే మ్యాటర్ ఉంది మరి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి వీర రాఘవరెడ్డి. ఆయన హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నాడు రాజేంద్రనగర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వీర రాఘవ రెడ్డి ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 2022లో రామరాజ్యం అనే దానిని ప్రారంభించాడు. అలాగే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్నాడు.
ఈయన భగవద్గీత శ్లోకాలను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాడు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి రామరాజ్యం సైన్యంలో చేరడానికి ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక చూస్తే 2024 సెప్టెంబర్ 1న, అలగే డిసెంబర్ 31, 2024 మధ్య రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులను రూ. 20,000 జీతంతో రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించాడని డిసిపి చెప్పారు.
ఇంతకీ రామరాజ్యం ఆర్మీ మీద కేసు ఏమిటి అంటే అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటును వీర రాఘవరెడ్డి చేసారు. రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు పేరుతో మొదటి స్లాట్ లో 5000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ వీరిది. రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్లు వచ్చాయి.
అలా రెండు తెలుగు రాష్ట్రాల నుండి రామరాజు ఆర్మీకి డొనేషన్లు వసూలు చేస్తున్నారు. ఇక 20 నుండి 50 సంవత్సరాల లోపు వారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో మెంబర్ షిప్ ఇస్తారట. ఐదు కిలోమీటర్ల నడవగల శక్తి ఉన్నవారికి మాత్రమే ఆర్మీలో చేరేందుకు అర్హతగా ఉంది. అంతే కాదు ప్రతి నెల 20 వేల రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ కూడా ఉంది. ఈ విధంగా ప్రకటిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు భారీగానే రామరాజ్యం ఆర్మీ రిజిస్ట్రేషన్లు చేయించింది.
ఒక్కో రిజిస్ట్రేషన్ కు 350 రూపాయలు రుసుము వసూలు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే సి ఆర్ పి సి 340 ను న్యాయ వ్యవస్థ లోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదిస్తోంది. అంతే కాదు దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపిస్తోంది. న్యాయవ్యవస్థ కేవలం క్రిమినల్స్ కే తప్ప సామాన్యులకు కాదు అన్నది రామరాజ్యం ఆర్మీ ఇంకో వాదన.
ఒక విధంగా చూస్తే ఇదేదో పరాకాష్టగా ఉంది. వ్యవహారం ముదిరి ఆఖరుకు ఒక ఆలయ అర్చకుడి మీద దాడిగా పరిణమించింది. ఈ సంఘటన మీద చాలా రకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మతపరమైన రెచ్చగొట్టుడు ధోరణి ప్రబలింది అని దానిని చూసి ప్రేరేపితులైన వారు చివరికి ఉన్మాదులుగా మారుతున్నారని అంటున్నారు.
ఈ చట్టాలతో కట్టుబాట్లతో రాజ్యాంగంతో సంబంధం లేదని భావిస్తూ తామేదో లోకం నుంచి ఏదో యుగం నుంచి వచ్చిన వారిగా భ్రమిస్తూ సాగిస్తున్నా ఈ విన్యాసాలు నిజంగా పరాకాష్టగా చూస్తున్నారు. అయితే ఆరెస్సెస్ తెలంగాణా శాఖ ఈ ఘటనను ఖండించింది. బాధ్యుల మీద చర్యలు తీసుకొని లోతైన దర్యాప్తు చేయమంది కోరింది. చూడాలి మరి మరెన్ని విషయాలు వెలుగు చూస్తాయో.