ముద్రగడను తట్టి లేపుతున్నారా ?
ఏపీ రాజకీయాల్లో ముద్రగడ ఒక ఫైర్ బ్రాండ్. ఆయనది దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం.
By: Tupaki Desk | 2 Feb 2025 9:30 PM GMTఏపీ రాజకీయాల్లో ముద్రగడ ఒక ఫైర్ బ్రాండ్. ఆయనది దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం. ఆయన రాజకీయాలలో రాజీలు లేవు. పేచీలే ఎక్కువ. అందుకే ఆయన ఎక్కడా ఇమడలేకపోయారు. ఆయన రాజకీయ సమీకరణలను చూసుకోరు. తన ఆలోచనల మేరకు చేసుకుంటూ పోతారు. లేకపోతే 2024 ఎన్నికలలో ఆయన కూటమి వైపు మొగ్గు చూపకుండా వైసీపీ వైపు మళ్ళడంలోనే ఉంది ఆయన రాజకీయం ఎలా ఉంటుందో అన్నది ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో ముద్రగడ పద్మనాభం ప్రభావం చాలానే ఉంది. అది కూడా చాలా కాలంగా ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో ముద్రగడకు కొంత ఇబ్బంది ఎదురైంది. ముద్రగడ మీద సొంత సామాజిక వర్గానికి గౌరవం అభిమానం ఉన్నా కూడా వారు దశాబ్దాల కోరిక అయిన కాపులకు సీఎం పదవి అన్నది పవన్ తోనే సాధ్యపడుతుందని ఆయన వైపుగా మొగ్గు చూపుతున్నారన్నది ఒక విశ్లేషణ.
ఇక చూస్తే అత్యధిక శాతం యువత్గ జనసేన వైపు ఉంటే మధ్యతరగతి ఆ వర్గాలు మాత్రం ముద్రగడ మీద ఈ రోజుకీ గురి పెట్టి ఉంచారు అన్నది కూడా వాస్తవం. రాజకీయాలు ఎపుడూ ఒకలా ఉండవు. తాము కోరుకున్నది జరగలక్పోతే ఇవే సామాజిక వర్గాలు మొత్తం ముద్రగడ వెనక చేరే అవకాశాలనూ ఎవరూ కొట్టిపారేయలేరు.
ప్రస్తుతానికి అయితే ముద్రగడ రాజకీయంగా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఆయన మునుపటి మాదిరిగా ప్రభావం అయితే చూపించలేకపోతున్నారు. అపుడపుడు ఆయన కూటమి ప్రభుత్వానికి లేఖలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఇంటి మీద దాడి జరగడం ఒక చర్చగా మారింది.
ఆయన మీద దాడి చేసిన జనసేన మనిషులు అని వైసీపీ అంటోంది. అలాంటిది లేదని ఆ పార్టీ కొట్టిపారేస్తోంది. ఇక ముద్రగడ ఇంటికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు సహా ఇతర నేతలు వెళ్ళారు. ఆయనను పరామర్శించారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడిలో ముద్రగడ కారు పూర్తిగా ధ్వంసం అయింది. దాంతో ఇది కావాలని ఎవరో చేశారని అంటున్నారు.
మామూలుగా చూస్తే ఈ తరహా దాడులు ఎపుడూ ముద్రగడ నివాసం మీద జరగలేదు. దాంతో కిర్లంపూడి లో అతి పెద్ద చర్చగా మారుతోంది. సాధారణంగా ముద్రగడ పట్టుదల కలిగిన మనిషి. ఆయన ఇంటి మీద జరిగిన దాడిని ఏ విధంగా తీసుకుంటారు అన్న చర్చకు తెర లేంచింది. మరో వైపు ఏడు పదులకు చేరువలో ఉన్న పెద్ద మనిషి నివాసం మీద ఈ తరహా దాడి జరగడం అన్నది మంచిది కాదు అన్న చర్చ కూడా ఉంది.
అది ముద్రగడకే పాజిటివ్ గా మారే పరిస్థితి ఉందని అంటున్నారు. ముద్రగడ మెల్లగా రాజకీయంగా తన పాత్రను తగ్గించుకుని కుమారుడిని సెట్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ దాడుల వల్ల ఆయన మళ్ళీ దూకుడు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు అని అంటున్నారు. ముద్రగడ ఇపుడు మళ్ళీ రంగంలోకి దిగాలని అనుకుంటే మాత్రం అది ఆయన ప్రత్యర్ధులు కోరి అస్త్రాలు అందించినట్లే అని అంటున్నారు.
రాజకీయంగా కానీ సామాజికపరంగా కానీ కొందరు నేతలకు ఉన్న ఇమేజ్ అలాగే ఉంటుంది. కొన్ని సార్లు ప్రతికూల పరిస్థితుల వల్ల ఆ ఇమేజ్ కి కొంత మసకబారడం జరగవచ్చు. అంతమాత్రం చేత వారిని తక్కువ అంచనా వేయకూడదని విశ్లేషణలు ఉన్నాయి. నీటిలో మొసలి మాదిరిగా వారి బలం ఎపుడూ గట్టిగానే ఉంటుందని అంటున్నారు. మరి ముద్రగడను ఎందుకు తట్టి లేపాలనుకుంటున్నారో లేక కదిపి కుదపాలని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆయన మళ్ళీ ఫీల్డ్ లోకి వస్తే అది జోరెత్తిస్తుంది అనే అంటున్నారు. ముద్రగడ కూడా సరైన సమయం కోసం చూస్తున్న వేళ ఈ దాడిని ఆయన ఎలా మలచుకుంటారు అన్న చర్చ కూడా సాగుతోంది.