టీటీడీలో అన్యమత ఉద్యోగులపై వేటు
ఇటీవల కాలంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Feb 2025 7:43 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉద్యోగాలు చేస్తూ అన్యమతాలను ఆచరిస్తున్న వారిని బదిలీ చేసింది. ఇటీవల కాలంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ఉద్దేశపూర్వంగా అన్యమత ప్రచారం చేస్తున్నారని, క్షేత్రంలో మద్యం, మాంసం, గంజాయి వంటివి విక్రయిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఫోకస్ చేసింది.
వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని టీడీపీ గతంలో ఆరోపించేంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల క్షేత్రాన్ని కాపాడతామని చెప్పుకుంది. శ్రీవారి భక్తుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీటీడీ పరిరక్షణకు అడుగులు వేశారు. ఇందులో భాగంగానే లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచడంతోపాటు అన్న ప్రసాదంపై జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక టీటీడీలో అన్యమత ప్రభావం ఎక్కువైందని విమర్శలపై తాజాగా ఫోకస్ చేశారు.
తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ లిస్టును టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. వీరిలో కొందరు ఉద్యోగులు రిటైరుకాగా, మరికొందరు విధుల్లో కొనసాగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆదాయం నుంచి జీతాలు తీసుకుంటూ వీరు ఇతర మతాలను ఆచరించడమే కాకుండా, ఆ మతాల కోసం ప్రచారం చేయడాన్ని తప్పుగా పరిగణించారు. దీంతో ముందుగా 18 మంది ఉద్యోగులను టీటీడీ నుంచి బదిలీ చేశారు. వీరిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల లెక్చరర్లు, హాస్టల్ వార్డున్లు ఉన్నారని చెబుతున్నారు.
టీటీడీ ప్రస్తుతం రూపొందించిన లిస్టులో ఉన్న 69 మంది కాకుండా, ఇంకా 300 మంది వరకు అన్యమతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై వివిధ స్టాల్స్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారిలో కూడా కొందరు అన్యమతాల వారు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిని గుర్తించేందుకు టీటీడీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.