ముద్రగడ నివాసంపై దాడి... జై జనసేన అంటూ ట్రాక్టర్ తో...!
ప్రధానంగా జనసేనకు కౌంటర్ గా ముద్రగడ గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Feb 2025 10:59 AM ISTగత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించినట్లు కనిపించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. ఇటీవల కాస్త కామ్ అయినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా జనసేనకు కౌంటర్ గా ముద్రగడ గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ముద్రగడ పద్మనాభం ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారని అంటారు. ఇదే సమయంలో... ముద్రగడ వర్సెస్ జనసేన అనే ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పేరుతో ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారని ముద్రగడ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో... తనపై సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు! తనకు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని ఆయన గతంలో చెప్పిన పరిస్థితి! అయితే.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రబసకు సంబంధించిన వార్తలు పెద్దగా కనిపించలేదు.
వైసీపీ ఘోర ఓటమితో ముద్రగడ సైలంట్ అయిపోతే.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో జనసైనికులు కామ్ అయిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ముద్రగడ పద్మనాభం నివాసంపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ట్రక్టర్ వేసుకుని వచ్చి ఇంటిని గుద్దేశాడు.
అవును... మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసంపై ఆదివారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ సమయంలో... జై జనసేన అంటూ ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ వచ్చి కిర్లంపూడి లోని ఆయన ఇంటి గేటును గట్టిగా ఢీకొట్టి, తోసుకుంటూ లోనికి వెళ్లాడు.
అనంతరం అదే ట్రాక్టర్ తో కారును బలంగా ఢీకొట్టాడు. ఈ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంటిలో నుంచి బయటకు వచ్చారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది.. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.