Begin typing your search above and press return to search.

రాజ‌ధాని ర‌గ‌డ‌.. ముఖ్య‌మంత్రి ఇంటిపై రాళ్ల దాడి!

ఈ దాడుల్లో మేఘాల‌య ముఖ్య‌మంత్రి కన్రాడ్‌ సంగ్మా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

By:  Tupaki Desk   |   24 July 2023 5:07 PM GMT
రాజ‌ధాని ర‌గ‌డ‌.. ముఖ్య‌మంత్రి ఇంటిపై రాళ్ల దాడి!
X

ప్ర‌జ‌లు ఆగ్ర‌హిస్తే ఎలా ఉంటుందో చ‌విచూశారు.. మేఘాల‌య ముఖ్య‌మంత్రి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవ‌ల ఆందోళ‌న‌లు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ మ‌ణిపూర్ రాష్ట్రం లో రిజ‌ర్వేష‌న్ ర‌గ‌డ సాగుతు న్న విష‌యం తెలిసిందే. పార్ల‌మెంటును కూడా స్తంభింప‌జేస్తున్న ఈ రాష్ట్రం దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇదిలావుంటే, తాజాగా మ‌రో రాష్ట్రం మేఘాల‌య‌ లోనూ ప్ర‌జలు రోడ్డెక్కారు. శీతాకాల రాజ‌ధాని ఏర్పాటు కోసం.. వారు ఎప్ప‌టి నుంచో ఆందోళ‌న‌లు చేస్తున్నారు. అయితే, స‌ర్కారు నుంచి పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డంతో తాజాగా ముఖ్య‌మంత్రి ఇంటి పై దాడులు చేశారు. 'తురా' ప్రాంతం లో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాల ని డిమాండ్‌ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని, ఆయ‌న ఇంటిని ముట్టడించారు.

అయితే, ఈ దాడుల్లో మేఘాల‌య ముఖ్య‌మంత్రి కన్రాడ్‌ సంగ్మా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డును బ్లాక్‌ చేయడంతో ఆయనతో పాటు ఓ మంత్రి కార్యాలయం లోనే ఉండిపోయినట్టు తెలిపారు. దాడి లో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపు లోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.

ఎప్ప‌టి నుంచో ర‌గ‌డ‌

తురా లో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలనేది ఎప్ప‌టి నుంచో ర‌గులుతోంది. ఈ క్ర‌మంలోనే గారో హిల్స్‌కు చెందిన పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష కూడా చేపట్టాయి. ఇదిలావుంటే, ఈ రాజ‌ధాని విష‌యం పై తాజాగా ముఖ్య‌మంత్రి ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ఈ అంశం పై పౌర సంఘాల ప్రతినిధులతో శాంతియుతంగా చర్చిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యం లోనే సంగ్మా ఇంటిపైనా, కార్యాల‌యంపైనా ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కొస‌మెరుపు: మేఘాల‌య‌ లోనూ బీజేపీ నేతృత్వంలో స్థానిక పార్టీ నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది.