Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లా దర్శిలో ఆరాచకం.. ఆమెపై ఎంత దారుణంగా దాడి అంటే?

పంద్రాగస్టులోకి అడుగుపెట్టటానికి కాస్త ముందుగా చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   16 Aug 2023 4:43 AM GMT
ప్రకాశం జిల్లా దర్శిలో ఆరాచకం.. ఆమెపై ఎంత దారుణంగా దాడి అంటే?
X

ప్రకాశం జిల్లా దర్శిలో ఆరాచకకాండ చోటుచేసుకుంది. పంద్రాగస్టులోకి అడుగుపెట్టటానికి కాస్త ముందుగా చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. విన్నంతనే షాక్ తినేలా ఉన్న ఈ ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. కళ్లలో కారం కొట్టి.. వివస్త్రను చేసి.. కత్తులతో దాడి చేసి.. క్రూరంగా హింసిస్తూ.. అక్కడితో ఆగకుండా పెట్రోలో పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ అమానుష కాండ గురించి తమకు సమాచారం అందినంతనే పోలీసులు స్పందించటంతో బాధితురాలు బతికి బట్టకట్టింది. అసలేం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఒక ఎస్సీ కాలనీకి చెందిన ఒక కుటుంబం ఉంది. ఇంటి పెద్ద చాలా సంవత్సరాల కిందటే మరణించారు. ఒంటరి మహిళకు ఒక కుమార్తె.. కొడుకు ఉన్నారు. కుమార్తెకు పదేళ్ల క్రితం పెళ్లి చేయగా.. రెండేళ్ల క్రితం భర్త చనిపోయారు. ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమె తమ్ముడు కొంతకాలంగా బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తెను ప్రేమించుకున్నారు.

ఈ మార్చిలో వారు ఊరి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా భావించింది బ్రహ్మారెడ్డి కుటుంబం. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటి మీద దాడి చేసి తల్లిని.. అక్కను తీవ్రంగా తిట్టి.. దాడికి పాల్పడ్డారు. తమ కుమార్తెను తీసుకొచ్చి తమకు అప్పగించకుంటే చంపేస్తామని బెదిరించటంతో వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో వారిపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై.. జైలుకు వెళ్లారు. కొద్దికాలానికి బెయిల్ రావటంతో బయటకు వచ్చారు.

తల్లిని చూసేందుకు బాధితురాలు సోమవారం వచ్చారు. అర్థరాత్రి వేళలో కుళాయి విడవటంతో నీళ్లు పట్టుకోవటానికి ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడున్న బ్రహ్మారెడ్డి.. అతని భార్య పుల్లమ్మ ఆమెపై దాడి చేవారు. కళ్లలో కారం చల్లి.. కత్తులతో పొడిచారు. వీధిలోకి ఈడ్చుకుంటూ వెళ్లి వివస్త్రను చేశారు. తాళ్లతో కాళ్లు.. చేతులు కట్టేసి గొడ్డలి వెనుక ఉండే కర్ర పిడికిలతో ఆమెను ఇష్టానుసారం కొట్టారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నానికి వెనుకాడలేదు. జరుగుతున్న దారుణానికి ఎదురు చెప్పలేని స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు.

జిల్లా కేంద్రం నుంచి అందిన సమాచారంతో వెనువెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. అప్పటికే బ్రహ్మారెడ్డి ఇంట్లో బాధితురాలు బంధీగా ఉంది. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడింది. పెట్రోల్ పోసి తగలబెట్టే వేళలో పోలీసులు అక్కడకు చేరుకోవటంతో.. ఆమెను ప్రాణాలతో రక్షించగలిగారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ సూచనతో దాడికి పాల్పడిన బ్రహ్మరెడ్డిని.. అతడి భార్య పుల్లమ్మను అరెస్టు చేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.