వీడియో వైరల్.. రాహుల్ కారుపై దాడి!
రాహుల్ పార్టీ నేతలను కలిసేందుకు కారులో నుంచి బయటకు వస్తుండగా వాహనం వెనుక అద్దాలు పగిలినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది
By: Tupaki Desk | 31 Jan 2024 9:03 AM GMTవచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన యాత్రను మణిపూర్ లో ప్రారంభించగా ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్ కు చేరుకుంది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో ఈ ఘటన జరిగింది. దుండగుల రాళ్ల దాడిలో రాహుల్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
రాహుల్ గాంధీ కారుపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రాహుల్ పార్టీ నేతలను కలిసేందుకు కారులో నుంచి బయటకు వస్తుండగా వాహనం వెనుక అద్దాలు పగిలినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా జనవరి 31 ఉదయం 11.15 గంటల ప్రాంతంలో మాల్టా జిల్లాలోని దేబీపూర్, రతువా మీదుగా యాత్ర సాగుతుండగా రాహుల్ కాన్వాయ్ పై దాడి జరిగింది.
కాగా రతువాలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశాక న్యాయ్ యాత్ర రతువా స్టేడియం నుండి ప్రారంభమై సుజాపూర్ వైపు వెళుతుంది, అక్కడ రాహుల్ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
కాగా రాహుల్ గాంధీ ఉన్న కారులోనే కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. రాహుల్ పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిననాటి నుంచే ఆయనపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నారని చౌదరి ఆరోపించారు. ఎవరు అడ్డుకోవాలని చూసినా యాత్ర ఆపబోమని.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు.
ఇక రాహుల్ యాత్ర ఫిబ్రవరి 1న ముర్షిదాబాద్ లోకి ప్రవేశిస్తుంది.పశ్చిమ బెంగాల్ లోని ఆరు జిల్లాల మీదుగా సాగిన రాహుల్ యాత్ర ఇప్పటివరకు 523 కి.మీ. పూర్తయింది. ఇప్పటివరకు డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపుర్ దువార్, ఉత్తర దినాజపూర్ ల్లో ముగిసింది. మాల్దా, ముర్షిదాబాద్ లలో చేపట్టాల్సి ఉంది.
కాగా రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.