బెజవాడలో తమ్ముళ్లు అంత విధ్వంసకాండ చేశారా?
తెలుగు తమ్ముళ్లు పలువురు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై దాడికి విఫలయత్నం చేయటం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 8 Jun 2024 4:45 AM GMTఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్లో మార్పు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల వెల్లడి వరకు విపక్షంలో ఉన్న టీడీపీ..జనసేన.. బీజేపీలు అధికార పక్షంగా మారటం.. త్వరంలో అధికారికంగా పాలనాపగ్గాలు చేపట్టనుండటం తెలిసిందే. అయితే.. ఫలితాల వెల్లడైన నాటి నుంచి పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కొనసాగింపుగా శుక్రవారం విజయవాడ పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాలుగా చెబుతున్నారు. తెలుగు తమ్ముళ్లు పలువురు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై దాడికి విఫలయత్నం చేయటం సంచలనంగా మారింది.
విజయవాడలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో నివాసం ఉంటున్న వంశీ అపార్టుమెంట్ కు టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన దాడులు రాత్రి వరకు కొనసాగినట్లుగా చెబుతున్నారు. బూతులు.. కేకలు.. అరుపులతో ఆ ప్రాంతం మొత్తం అట్టుడికిపోయినట్లుగా చెబుతున్నారు. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చేందుకు సీఆర్ పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు.
తాజా ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలోనే అల్లరి మూకలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వేళలో నాలుగు కార్లలో టీడీపీ కార్యకర్తలుగా చెబుతున్న కొందరు వంశీ ఉంటున్న అపార్టుమెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ.. కార్లలో తమతో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. దీంతో వంశీ కారుతో పాటు మరికొన్ని కార్లు.. టూవీలర్లు ధ్వంసమయ్యాయి. అక్కడి సమీపంలోని ఇళ్ల అదాలు సైతం ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. విజయవాడ సీపీ రంగంలోకి దిగి సీఆర్పీఎఫ్ దళాల్ని రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దారు.
అయితే.. ఈ ఉదంతంపై టీడీపీ వర్గాల వాదన మరోలా ఉంది. వంశీ అనుచరులు తమను రెచ్చగొట్టటం వల్లే ఇదంతా చోటు చేసుకుందని చెబుతున్నారు. వంశీ అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని.. బూతులు తిడుతూ అవమానిస్తున్నారని.. ఇదే తాజా పరిస్థితికి కారణమని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న దేవినేని అవినాశ్ కు పోలీసులు భద్రత పెంచటం గమనార్హం.