అగ్రరాజ్యంలో హిందువులపై దాడులు.. తీవ్ర ఆందోళన.. ఏం జరుగుతోంది?
కొన్నాళ్ల కిందట అమెరికాలో కొన్ని హిందూ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమై.. తమపై జరుగుతున్న దాడులను ఖండించాయి.
By: Tupaki Desk | 16 April 2024 11:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా భారత్‌లో హిందూ భావజాలం వ్యాప్తిపై జరుగుతున్న ప్రచారం.. తీసుకుంటున్న నిర్ణయాలు వంటివి అమెరికాలోనూ ప్రభావం చూపిస్తు న్నాయని ఇక్కడి హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట అమెరికాలో కొన్ని హిందూ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమై.. తమపై జరుగుతున్న దాడులను ఖండించాయి. ముఖ్యంగా ఆలయాలు.. వ్యక్తులను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న దాడులను నిలువరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పాయి. ఇప్పుడు తాజాగా సెనేట్ ప్రతినిధి ఒకరు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం జరుగుతోంది..?
అమెరికాలో ఉన్న జనాభాలో 9 శాతం మంది హిందువులే కావడం గమనార్హం. ప్రవాస భారతీయులతో పాటు.. చైనా, టికెట్, నేపాల్, జపాన్ తదితర దేశాల నుంచి వెళ్తున్న హిందువులు(వీరిలో బౌద్ధులు కూడా ఉన్నారు) అక్కడ ప్రత్యేకతను సంతరిం చుకున్నారు. ఇక, భారత్ నుంచి వెళ్లిన హిందువులు అయితే.. ఇటీవల కాలంలో ఆలయాలు కూడా నిర్మించి.. ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కానీ, ఎన్నడూ లేని విధంగా గత దశాబ్ద కాలంగా అమెరికాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. ఈ విషయమే ఇప్పుడు అమెరికాలో హిందు వర్గాలను కలచి వేస్తోంది. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా పలు రాష్ట్రాల్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి.
తాజా విషయం ఏంటంటే..
ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యుడు తానేదార్ హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తంచేశారు. హిందువులకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు, సంఘాలు సమన్వయంతోనే ఈ దాడులు చేస్తున్నాయనేది ఆయన ప్రధాన ఆరోపణ. ‘అమెరికాలో నేడు హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో హిందువులపై రోజు రోజుకు అసత్య ప్రచారం పెరిగిపోతోంది. ఇలాంటి దాడులను మనకు మనమే నిలువరించుకోవాలి. దీనికి వ్యతిరేకంగా కలసికట్టుగా ముందుకుసాగాలి`` అని తానేదార్ పేర్కొన్నారు.
నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో హిందూయాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తానేదార్ మాట్లాడుతూ.. ఇంత జరుగుతున్నా దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతోపాటు ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెడుతున్నప్పటికీ వాటిపై పురోగతి ఉండటం లేదన్నారు. ఇప్పటికైనా హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీసులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహా న్యాయశాఖ దృష్టి పెట్టాలని ఆయన విన్నవించారు. ఈ విషయంలో ఇండో-అమెరికన్ సభ్యులు రోఖన్నా, రాజా కృష్ణమూర్తి, అమీబెరా, ప్రమీలా జయపాల్ ఇటీవల న్యాయ శాఖకు లేఖలు కూడా రాసినట్టు పేర్కొన్నారు. కాగా.. గత ఏడాది భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.