ఎన్నికల వేళ.. 'రైతు బంధు' రాజకీయం!
కాంగ్రెస్ వాదన బలంగా మారి.. రైతులు ప్రభావితం అయితే.. బీఆర్ ఎస్‌కు కీలకమైన ఓటు బ్యాంకు ప్రతి బంధకంగా మారనుందనే అంచనాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 27 Oct 2023 2:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాకముందే.. పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ ఎస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా మారిన రైతు బంధుపై రాజకీయం మరింతగా వేడెక్కింది. ప్రస్తుతం రైతు బంధును విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే.. దీనిని విడుదల చేసేందుకు నిజానికి ఖజానాలో సొమ్ము సరిపోయే పరిస్థితి లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ వంటివాటిని చూపి.. ఈ దఫా నిధులను నిలిపివేయడం ద్వారా.. కొంత మేరకు ఉపశమనం పొందాలనే ఆలోచన అధికార పార్టీకి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. సర్కారు ను ఈ కీలక సమయంలో ఇరుకున పెట్టేలా.. కాంగ్రెస్ వ్యూహాత్మక రాజకీయానికి తెరదీసింది. రైతు బంధు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇది రైతుల్లోకి బలంగా వెళ్తోంది.
కాంగ్రెస్ వాదన బలంగా మారి.. రైతులు ప్రభావితం అయితే.. బీఆర్ ఎస్‌కు కీలకమైన ఓటు బ్యాంకు ప్రతి బంధకంగా మారనుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో బీఆర్ ఎస్ కూడా.. ప్లేట్ మార్చింది. తాము రైతు బంధును ఇవ్వాలని అనుకున్నామని.. కానీ, కాంగ్రెస్ పార్టీనే దీనికి అడుగడుగునా అడ్డు పడుతోందని.. ఆ పార్టీ చెబుతోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఉత్తరాలు రాస్తూ.. రైతు బంధును అడ్డుకుంటోందని బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మంత్రి హరీష్‌రావు తాజాగా వ్యాఖ్యలుచేశారు.
అయితే.. రైతు బంధు పథకం ఇప్పటిది కాదు కనుక.. ఎన్నికల వేళ ఆ పథకాన్ని అడ్డుకునేఅవకాశం లేదు. గతంలో పలు రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. ఎప్పుడో ప్రారంభించిన పథకాలను కొనసాగించుకో వచ్చని కోర్టులు కూడా తీర్పు చెప్పాయి. సో.. కాంగ్రెస్ అడ్డు పడినా.. చేయాలని అనుకుంటే.. బీఆర్ ఎస్ సర్కారుకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ను ఇరుకున పడేయడంతోపాటు.. ఖజానా పరిస్థితి నుంచి కూడా తప్పించుకునే వ్యూహంతో బీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు రైతు బంధం సంచలన అంశంగా మారిపోయింది.