ఆ వ్యాపారికి వాడపల్లివెంకన్నపై గురి.. వారం వారం విమానంలో రాక
ఆధ్యాత్మిక చింతన మనుషులను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేవుడిపై నమ్మకం పాపభీతితో మెసలేలా చూస్తుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆలయాలకు వెళ్లడం ఓ మంచి మార్గం
By: Tupaki Desk | 23 July 2023 3:27 PM ISTఆధ్యాత్మిక చింతన మనుషులను ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేవుడిపై నమ్మకం పాపభీతితో మెసలేలా చూస్తుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆలయాలకు వెళ్లడం ఓ మంచి మార్గం. ఇది తెలియని చాలామంది మానసిక ప్రశాంతత కరువై ఇబ్బందిపడుతుంటారు. ఇక కొందరికి కొన్ని ప్రాంతాల్లోని ఆలయాలపై విపరీతమైన గురి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ ఆడిటర్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి నెల వ్యవధిలోనే రెండు విడతలుగా రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఇదే కోవలో తిరుమల వెంకన్నకు రూ.కోట్లాది విలువైన కానుకలను ఇచ్చినవారూ ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు వారు తిరుమల అంటే ప్రాణం ఇస్తారు. శ్రీ వేంకటేశ్వరుడిని తలచుకుంటూ తరించిపోతారు.
కన్నడ నాట భక్తి కస్తూరి
తెలుగు రాష్ట్రాలు రెండింటితోనూ సరిహద్దు ఉన్న రాష్ట్రం కర్ణాటక. అందులోనూ తెలుగు వారు ఎక్కువగా ఉండే రాష్ట్రం. దీనికితోడు కన్నడ భాష తెలుగుకు చాలా దగ్గరగా ఉంటుంది. కొన్నేళ్ల కిందట వరకు కన్నడ సినిమాలు తెలుగులోకి అంతగా వచ్చేవి కావు. కానీ, కేజీఎఫ్ సిరీస్, కాంతారాతో కన్నడ స్టార్లు యశ్, రిషభ్ శెట్టి మనకు బాగా దగ్గరైపోయారు. ఇక కన్నడ రాజకీయాలను తెలుగువారు ప్రభావితం చేస్తుంటారు. కాగా, కన్నడిగులకు శివుడంటే పరమ ప్రీతి. ఏపీలోని శ్రీశైలం వారి అత్యంత ఇష్టమైన ఆలయం అనడంలో సందేహం లేదు. అయితే, కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి ఎందుకనో డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లి వెంకన్నపై గురి కుదిరింది. ఆయన సన్నిధికి ఏడు వారాలు విధిగా వస్తే కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. అలా బెంగళూరు వ్యాపారీ వస్తున్నారు. అది సాదాసీదాగా రైళ్లోనో, బస్సులెక్కో కాదు.. సొంత విమానంలో కావడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి..
బెంగళూరుకు చెందిన ఆ భక్తుడు సొంత విమానంలో వారం వారం వచ్చి వెంకన్న సన్నిధిలో ఉండి వెళ్తున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా, ఆయన ఆరు వారాల నుంచి వస్తున్నారు. అంతేగాక ఆలయానికి రూ.కోటి విరాళం అందించారు.
కాగా, బెంగళూరుకు చెందిన పరమ భక్తుడి వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. ఆయన సొంత విమానంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి కారులో వాడపల్లి చేరుకుంటున్నారు.