ఆంగ్ సాన్ సూకీ ఇల్లు వేలం.. కొంటారా?
ప్రముఖులకు చెందిన వస్తువులను వేలం వేస్తే.. వేలం ధరకన్నా.. నాలుగైదు రెట్లు పెట్టి కొనుగోలు చేసే వారు తరచు మనకు కనిపిస్తూనే ఉన్నారు
By: Tupaki Desk | 16 Aug 2024 2:30 AM GMTప్రముఖులకు చెందిన వస్తువులను వేలం వేస్తే.. వేలం ధరకన్నా.. నాలుగైదు రెట్లు పెట్టి కొనుగోలు చేసే వారు తరచు మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఇటీవల మన దేశంలో మమతా బెనర్జీ వేసిన పేయింటిగ్స్‌ను నాలుగు రెట్లు ధర పెట్టి ఒక అమెరికన్ కొనుగోలు చేశారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రముఖుల వస్తువులకు గిరాకీ ఉంటుంది. అలాంటిది.. భారత్ పొరుగు దేశం మయన్మార్(బర్మా) లో ప్రజల హక్కుల కోసం.. తన జీవితాన్ని త్యాగం చేసిన ఆంగ్ సాన్ సూకీకి చెందిన ఇంటిని వేలం వేస్తే.. ఒక్కరంటే ఒక్కరు కూడా కొనేందుకు ముందుకు రాలేదట!
అసలేంటీ విషయం!
మయన్మార్ హక్కుల నేత.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్సూకీకి వారసత్వంగా ఒక ఇల్లు సంక్రమించింది. ఇది ఆమె తండ్రి జనరల్ ఆంగ్ సాన్‌కు చెందిన ఇల్లు. దీనిని దేశంలో అతి పెద్ద నగరం యంగూన్‌లోని ఓ సరస్సు ఒడ్డున నిర్మించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్థుల్లో ఈ ఇల్లు ఉంటుంది. దీనిలో డైనింగ్ హాల్‌లో ఒకేసారి 100 మంది కూర్చుని భోంచేసేలా ఏర్పాటు చేశారు. 30 మంది అతిథులకు.. ఇక్కడ ఏర్పాట్లు కూడాఉన్నాయి.
అలాంటి ఇల్లు.. ఇప్పుడు వేలానికి పెట్టారు. దీనికి కారణం.. సూకీ సోదరుడికి.. ఆమెకు పడడం లేదు. ఈ క్రమంలో దీనిని విక్రయించేసి.. డబ్బులు పంచుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో 142 మిలియ న్ డాలర్ల ధరతో(భారత కరెన్సీలో 1192 కోట్ల రూపాయలు) దీనిని వేలానికి పెట్టారు. అయితే.. దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో మరోసారి వేలానికి సిద్ధమయ్యారు. మరి ఇంట్రస్ట్ ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చు.
కారణం ఏంటి?
ప్రముఖ హక్కుల నాయకురాలిగా పేరున్న ఆంగ్ సాన్ సూకీ ఇంటిని ఎవరూ కొనకపోవడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నిర్బంధంలో ఉన్నారు. పైగా.. పలు కేసుల్లో ఆమెకు కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ క్రమంలో ఆమె అనుమతి లేకుండా.. దీనిని ఆమె సోదరుడు వేలం వేస్తున్నారు. దీంతో సూకీ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో లేనిపోని వివాదంలో వేలు పెట్టి చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకని ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.
ఏంటీ ఇంటి ప్రత్యేకత?
+ యంగూన్‌లో సరస్సు ఒడ్డున 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
+ దేశంలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలకు ఈ ఇల్లు అనధికారిక కార్యాలయంగా పనిచేసింది.
+ ఈ ఇంట్లోనే సూకీతో ఒకప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిలరీ క్లింటన్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ తదితరులు భేటీ అయ్యారు.