Begin typing your search above and press return to search.

టెక్సాస్ లో కాల్పులు... మృతుల్లో నిందితుడి తల్లితండ్రులు?

విదేశాల్లో భారతీయులు ఎక్కువగా ఉండే ఏ చోట కాల్పుల శబ్ధం వినిపించినా ఇక్కడ ఉన్నవారు ఉలిక్కిపడుతుంటారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:36 AM GMT
టెక్సాస్ లో కాల్పులు... మృతుల్లో నిందితుడి తల్లితండ్రులు?
X

విదేశాల్లో భారతీయులు ఎక్కువగా ఉండే ఏ చోట కాల్పుల శబ్ధం వినిపించినా ఇక్కడ ఉన్నవారు ఉలిక్కిపడుతుంటారు. పైగా ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ పెరిగిపోతున్నాయనే కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా టెక్సాస్ లోని రెండు నగరాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారని తెలుస్తుంది.

అవును... టెక్సాస్ లోని ఆస్టిన్, శాన్ ఆంటోనియో నగరాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఆరుగురు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారు! మృతుల్లో... శాన్ ఆంటోనియోలోని పోర్ట్ రాయల్ స్ట్రీట్ 6400 బ్లాక్ సమీపంలోని నివాసంలో 55 ఏళ్ల పురుషుడు, ఒక మహిళ ఉన్నారు.

ఈ దారుణాలకు పాల్పడిన నిందితుడికి పోర్ట్ రాయల్ స్ట్రీట్‌ లోని నివాసంతో సంబంధాలు ఉన్నాయని ఆస్టిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. బెక్సర్ కౌంటీ అధికారులకు తెలియజేసింది. ఈ క్రమంలో షేన్ జేమ్స్ అనే 34 ఏళ్ల పురుషుడు ఆస్టిన్‌ లోని నరహత్యలు, కాల్పులు.. అలాగే శాన్ ఆంటోనియోలో జరిగిన డబుల్ హత్యలకు కారణమని ఆస్టిన్ అధికారులు విశ్వసిస్తున్నారు.

అయితే తాజాగా జరిగిన కాల్పులకు సంబంధించిన క్రైం సీన్ తో అతడు ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాడనేది మాత్రం వెల్లడించలేదు. ఇదే సమయంలో... అనుమానితుడు రెండేళ్లుగా ఆర్మీలో ఉన్నాడని ఆర్మీ అధికార ప్రతినిధి స్థానిక మీడియాతో ధృవీకరించారు. అతను ఫిబ్రవరి 2013 నుండి ఆగస్టు 2015 వరకు పదాతిదళ అధికారిగా పనిచేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో నిందితుడు దేశాన్ని విడిచి వెళ్లలేదని చెబుతున్నారు.

ఈ క్రమంలో ముందుగా శాన్ ఆంటోనియోలోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం చనిపోయారని బెక్సర్ కౌంటీలోని అధికారులు తెలిపారు. ఆ బాధితులు ఫిలిస్ జేమ్స్(55), షేన్ జేమ్స్ సీనియర్ (56) అని చెబుతున్నారు. వీరిద్దరూ అనుమానితుడి తల్లిదండ్రులు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అనుమానితుడి తోబుట్టువు తల్లిదండ్రులతో చివరిసారి మాట్లాడినట్లు చెబుతున్నారు.

అదే రోజు మధ్యాహ్నానికి ముందు మరొక ఇంట్లో జంటహత్యలు జరిగాయని చెబుతున్నారు. వారిని ఇమ్మాన్యుయేల్ పాప్ బా(32), సబ్రినా రెహమాన్(24)గా గుర్తించారు. వీరిలో పాప్ బా ఘటనా స్థలంలో మరణించినట్లు ప్రకటించగా, రెహమాన్‌ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె మరణించిందని ఆస్టిన్ పోలీసులు తెలిపారు.

వీరిపై కాల్పులకు ఒక గంట ముందు.. ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీసు అధికారి కాల్చబడ్డాడు. సాయంత్రం 5 గంటలకు ముందు, 39 ఏళ్ల సైకిలిస్ట్‌ పై దాడి జరిగిందని తెలుస్తుంది!

ఈ విషయాలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ స్పందించారు. అనుమానితుడు "మళ్లీ వెలుగు చూడకూడదు" అని ఒక ప్రకటనలో తెలిపారు. "ఒక కరడుగట్టిన నేరస్థుడిచే హత్య చేయబడిన ఆరుగురు కోసం టెక్సాన్లు దుఃఖిస్తున్నారు" అని అబాట్ చెప్పాడు.