ఆ దేశం సంచలన నిర్ణయం.. భారతీయులకేనా నష్టం?
భారతీయ విద్యార్థులు తమ విదేశీ విద్య కోసం ఎంచుకుంటున్న దేశాల్లో అమెరికా, కెనడాల తర్వాత ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలుస్తోంది.
By: Tupaki Desk | 27 Aug 2024 11:22 AM GMTభారతీయ విద్యార్థులు తమ విదేశీ విద్య కోసం ఎంచుకుంటున్న దేశాల్లో అమెరికా, కెనడాల తర్వాత ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీలో దాదాపు 70 యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. అంతేకాకుండా భారత్ తో సహా విదేశీ విద్యార్థులకు భారీ ఎత్తున స్కాలర్‌షిప్పులు ఇస్తుండటం, ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీ కావడం, మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధన లభిస్తుండటం వంటి కారణాలతో ఆస్ట్రేలియాను తమ గమ్యస్థానాల్లో ఒకటిగా భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగాలు, అక్కడే శాశ్వత నివాసం ఉండటానికి అనుమతి కూడా సులువుగానే లభిస్తోంది.
కాగా ఆస్ట్రేలియా వైశాల్యంపరంగా ప్రపంచంలోనే ఆరో పెద్ద దేశం. జనాభాలో మాత్రం టాప్ 20లో కూడా లేదు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్ల వరకు పెద్ద ఎత్తున ఆ దేశం వలసలను ప్రోత్సహించింది. వివిధ రంగాల్లో నైపుణ్యం గల మానవ వనరుల అవసరం పెద్ద ఎత్తున ఉండటంతో సులువైన వీసా విధానాలను ప్రవేశపెట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వలసలు పెరిగిపోయాయి. దీంతో గృహాల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. స్థానిక ఆస్ట్రేలియన్లతోపాటు వలస వచ్చినవారు గృహాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వలసలను నియంత్రించడానికి ఆస్ట్రేలియా మరిన్ని చర్యలకు దిగింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2025) నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయనుంది. 2025 విద్యా సంవత్సరానికి 2,70,000కు ఆస్ట్రేలియా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో 1,45,000, నైపుణ్య శిక్షణ విభాగంలో 95,000 మంది విదేశీ విద్యార్థులను అనుమతించేలా ప్రభుత్వం పరిమితులు విధించనుందని ఆస్ట్రేలియా విద్యాశాఖమంత్రి జాసన్ క్లేర్ తాజాగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో 2025 సంవత్సరానికి గానూ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం తక్కువగా, ఒకేషనల్ కాలేజీల్లో 20 శాతం తక్కువగా విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు.
అయితే దీనిపై యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తాము నష్టపోతామని వాపోతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే ఆ దేశ విద్యా శాఖ మంత్రి జాసన్ క్లేర్ దీనిపై విశ్వవిద్యాలయాలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తమ నిర్ణయం అంతర్జాతీయ విద్యను దెబ్బతీస్తుందనే వాదన తప్పన్నారు.
2023 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థులకు ఆరు లక్షల వీసాలను ఆస్ట్రేలియా మంజూరు చేసింది. అంతక్రితం సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ కావడం విశేషం. 2023 సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల వాటా 48 బిలియన్ల డాలర్లుగా ఉండటం గమనార్హం.
ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీస్ ఆఫ్ ఆస్ట్రేలియా ఛైర్మన్ డేవిడ్ లాయిడ్ తప్పుబట్టారు. ఏదో ఒక రంగం దెబ్బతినేలా వలస నియంత్రణలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు గతంలోనే ఆస్ట్రేలియా వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా వచ్చే రెండేళ్లలో వీరి వలసలను సగానికి తగ్గించవచ్చని అంచనా వేస్తోంది.
ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో నష్టపోయేవారిలో ప్రధానంగా భారతీయులే ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2022 నాటికి ఆ దేశంలో 1.09 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2019 నుంచి ఏటా ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి ఆస్ట్రేలియా పరిమితులు విధించనుండటంతో ఈ సంఖ్య తగ్గిపోనుంది.