Begin typing your search above and press return to search.

గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్? నిందితుడు ఆటో డ్రైవరా?

ప్రముఖ టీవీ చానళ్లు మొదలు.. పలు మీడియా సంస్థల వరకు గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల్ని ఆటో డ్రైవర్ ఒకరు కిడ్నాప్ చేశారన్న వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2024 6:30 AM GMT
గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్? నిందితుడు ఆటో డ్రైవరా?
X

నిజం కంటే అబద్ధం యమా స్పీడ్ లో దూసుకెళుతుందన్న సంగతి తెలిసిందే. మీడియాను దాటేసిన సోషల్ మీడియా పుణ్యమా అని.. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్న పరిస్థితి నుంచి తోక లేకున్నా.. ఏదో అనిపించిందని పులిగా ఫీలయ్యే పరిస్థితి మీడియాలో తాజాగా నెలకొంది. అరకొర సమాచారాన్ని తమకు తోచిన విధంగా ప్రజెంట్ చేసే తీరు ఎక్కువైంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా గచ్చిబౌలిలో ముగ్గురు పిల్లల్ని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగిన సంఘటనగా చెప్పొచ్చు.

ప్రముఖ టీవీ చానళ్లు మొదలు.. పలు మీడియా సంస్థల వరకు గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల్ని ఆటో డ్రైవర్ ఒకరు కిడ్నాప్ చేశారన్న వార్తలు వచ్చాయి. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల్ని ఎలా కిడ్నాప్ చేశారు? అందుకు దారి తీసిన కారణాలేమిటన్నది చూస్తే.. పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం..

మజీద్ బండలోని ఒక ప్రైవేటు స్కూల్ కు వెళ్లేందుకు కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. గుర్తు తెలియని ఆటో డ్రైవర్ ఒకరు వచ్చి వాళ్లను ఆటో ఎక్కించుకున్నరు. చిన్నారుల్లో ఇద్దరు బాలురు.. ఒక బాలిక ఉంది. ఆటో మజీద్ బండ వైపు వెళుతుండగా.. అనుమానంతో చిన్నారులు డ్రైవర్ ను ఎందుకు ఆ వైపు తీసుకెళుతున్నావు? అంటూ గట్టిగా అడిగారు.

వీరి ఆటోను దాటి వెళుతున్న మరో ఆటో డ్రైవర్ వీరిని చూసి అప్రమత్తమయ్యాడు. ఆటోను అడ్డుకొని సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. అసలు వాస్తవం వేరేగా ఉందంటున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన వాస్తవం ఏమంటే.. ముగ్గురు చిన్నారులు ఎక్కిన ఆటో డ్రైవర్ తెలిసిన వక్తేనని.. ఇంకో ఆటోడ్రైవర్ తప్పుగా అర్థం చేసుకోవటంతో ఈ గందరగోళం ఏర్పడిందని.. కిడ్నాప్ లాంటిదేమీ చోటు చేసుకోలేదని గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ రాత్రి వేళలో వెల్లడించారు. అప్పటికే.. కొన్ని మీడియా సంస్థలు అనుకున్నదే నిజమన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో.. నిజాన్ని వివరించలేక గచ్చిబౌలి పోలీసులు తల పట్టుకుంటున్న పరిస్థితి.