Begin typing your search above and press return to search.

కేటీఆర్ గారూ.. ఎందుకండి పిలవని పేరంటానికి వెళ్లడం..

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పది నెలల కాలంలో నిన్న కేటీఆర్ అనుకోని పరిస్థితి ఎదురైంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 12:30 PM GMT
కేటీఆర్ గారూ.. ఎందుకండి పిలవని పేరంటానికి వెళ్లడం..
X

గత పది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికి కూడా అడ్డుపడుతున్నారని అధికార పార్టీ కూడా ఆరోపిస్తోంది. ప్రతి అంశంలోనూ నెగెటివ్ కోణాన్ని వెతుకుతూ వాటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు ట్విట్వర్‌లోనూ నిత్యం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ యాక్టివ్ మోడ్‌లోనే ఉన్నట్లుగా చాటేందుకు కేటీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా పలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడ ఆందోళనలు జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. మరోవైపు.. ఇటీవల హైడ్రా, మూసీ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకొని పోరాడారు. మూసీ బాధితులను కలిశారు. తాము ఉన్నామంటూ వారికి భరోసా ఇచ్చారు. అటు హైడ్రా బాధితులను కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. మరోవైపు.. రైతుబంధు కోసం రైతులకు కలిసి ఆందోళనలు చేశారు. ఇక గ్రూప్ 1 వివాదంలోనూ విద్యార్థులతో కలిసి నిరసనలకు దిగారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పది నెలల కాలంలో నిన్న కేటీఆర్ అనుకోని పరిస్థితి ఎదురైంది. తమ హక్కుల సాధన కోసం ఆటోడ్రైవర్లు హైదరాబాద్ నగరంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయామని వారు చెప్పుకొచ్చారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అయితే.. వీరి మహాధర్నా విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ సడన్‌గా అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అది కూడా ఓ ఆటోలో ఆయన మహాధర్నా స్థలానికి వచ్చారు. ఆటోడ్రైవర్లకు మద్దతుగా అందులో పాల్గొనగా.. ఆయన డ్రైవర్ల నుంచి నిరసన వ్యక్తమైంది.

‘పిలవకుండా మీరెందుకు వచ్చారు..? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు..? పదేళ్లు అధికారంలో ఉండి మీరు మాకోసం ఏం చేశారు..? ఇప్పుడు రాజకీయం చేయడానికి ఇక్కడికి వచ్చారా..?’ అంటూ కేటీఆర్‌ను నిలదీశారు. దీంతో వారి మాటలతో కేటీఆర్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో పాలుపోక.. చివరకు అక్కడే వారితో పాటే ఉండిపోయారు. ఇక మైక్ తీసుకొని తనదైన స్టైల్‌లో మాట్లాడారు. మద్దతు తెలిపేందుకు వస్తే వద్దనడం సరికాదని, అలా అయితే మీరే లాస్ అవుతారంటూ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. అయితే.. డ్రైవర్ల నుంచి కేటీఆర్‌కు ఎదరైన చేదు అనుభవాన్ని ప్రస్తావిస్తూ పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పిలిచిన పేరంటానికి వెళ్తే ఓ మర్యాద ఉంటుందని, పిలవని పేరంటానికి పోయి అభాసుపాలు కావడం ఎందుకు’ అని ప్రశ్నించడం కనిపించింది. మరి ఇకనైనా కేటీఆర్ అందులో ఇందులో దూరిపోకుండా.. సరైన స్ట్రాటజీలో వెళ్తారో లేదో చూద్దాం.