Begin typing your search above and press return to search.

'మారాలి జగన్'...వైసీపీ కొత్త సిగ్నేచర్ ట్యూన్ !

కావాలి జగన్ రావాలి జగన్ అంటూ 2019 ఎన్నికల ముందు వైసీపీని ఎలివేట్ చేస్తూ సాగే ఒక పాట జనం మైండ్ ని బాగా పట్టేసింది. అలా ఒక ఊపు వచ్చి వైసీపీ అధికారం అందుకుంది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 10:30 AM GMT
మారాలి జగన్...వైసీపీ కొత్త సిగ్నేచర్ ట్యూన్ !
X

కావాలి జగన్ రావాలి జగన్ అంటూ 2019 ఎన్నికల ముందు వైసీపీని ఎలివేట్ చేస్తూ సాగే ఒక పాట జనం మైండ్ ని బాగా పట్టేసింది. అలా ఒక ఊపు వచ్చి వైసీపీ అధికారం అందుకుంది. ఇక 2024 ఎన్నికలు అయిపోయాయి. వైసీపీకి డిజాస్టర్ ఫలితం దక్కింది. ఈ సమయంలో రేపటి ఎన్నికల్లో వైసీపీకి కొత్త సిగ్నేచర్ ట్యూన్ లాంటి సాంగ్ అవసరం పడుతోంది.

దాని కంటే ముందు పార్టీలో మరో సిగ్నేచర్ ట్యూన్ వినిపిస్తోంది. అదేంటి అంటే మారాలి జగన్ మారి తీరాలి జగన్ అని. ఇదిలా ఉంటే పార్టీకి తాజాగా రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ అన్న మాటలు చేసిన విమర్శలు ఆ పార్టీలో చాలా మంది భావనగా కూడా చూడాలి.

ఎక్కడో తాడేపల్లిలో కూర్చుని జగన్ ఆదేశాలు ఇస్తే గ్రౌండ్ లెవెల్ లో వర్కౌట్ కావని అవంతి విమర్శించారు. అది నిజమే. జగన్ అన్న నాయకుడు జనంలోకి రావాలి. తానే స్వయంగా ఉద్యమించాలి. సరే దానికి టైం పడుతుంది అనుకుంటే ఆయన ముందు పార్టీ జనం గోడు అయినా వినాలి.

ఎంతసేపూ వైసీపీ అధినాయకత్వం నిర్వహిస్తున్న సమావేశాలలో ఒకే గొంతున వినిపిస్తుంది. వేదిక మీద మైకు పుచ్చుకుని జగన్ ఒక్కరే మాట్లాడుతారు. ఆయన మాటలను వినడమే తప్ప ఇవతల వారి బాధలు సమస్యలు వారి గొంతు వినే ఓపిక తీరిక వైసీపీ పెద్దలలు లేవా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఈ విధంగా ఎన్ని మీటింగులు పెట్టినా రిజల్ట్ ఏమి ఉంటుందని కూడా అంటున్నారు. ఎందుకంటే నాయకుడు అన్న వారు జనంలో ఉన్నపుడు ఎక్కువ మాట్లాడాలి. పార్టీ జనంతో ఉన్నపుడు తక్కువ మాట్లాడాలి. అపుడే పార్టీలో ఏమి జరుగుతుంది అన్నది ఆయనకు అర్ధం అవుతుంది అని అంటున్నారు

చంద్రబాబు ఈ పంధానే అనుసరిస్తారు. ఆయన పార్టీ నేతల మాటలు వింటారు. విడిగాను కలివిడిగాను కలుసుకుంటూ అందరితోనూ తాను ఉన్నాను అనిపిస్తారు. కానీ జగన్ తీరు దీనికి పూర్తిగా భిన్నం అని చెబుతారు ఆ వైఖరి వల్లనే వైసీపీ ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు.

పార్టీలో ఎంతో మంది నేతలు ఉన్నారు. వారి భావాలను వినే విధంగా నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప మీటింగుల పేరుతో జగన్ ఉపన్యాసాలు చెప్పి ముగిస్తూంటే పార్టీ మళ్లీ పుంజుకునేది ఎలా అన్న చర్చ వస్తోంది. ఇక జగన్ విషయంలో మరొకటి ఏంటి అంటే చంద్రబాబుని అదే పనిగా విమర్శించడం.

అది కూడా బయట జనం వద్దకు వెళ్ళి మీటింగులలో మాట్లాడినపుడు ఎటూ విమర్శించక తప్పదు. కానీ పార్టీ సమావేశాలలో అసలు వైసీపీ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా దానికి పటిష్టం చేసుకోవాలి అన్న దాని మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి కదా అని అంటున్నారు. ఇక జగన్ మరో ధీమాతో ఉన్నారని అంటున్నారు.

తాను ఓడింది టీడీపీ ఎక్కువగా హామీలు ఇవ్వడం వల్ల అని ఆయన నమ్ముతున్నారు. ఆ హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని అందువల్ల జనాలు మళ్లీ తనకే అధికారం ఇస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే పధకాలు ఇవ్వడం వరకూ వైసీపీ ఓకే అనిపించుకున్నా జనాలు వాటితో పాటు ఇంకా చాలా కోరుకున్నారని ఆ విషయంలో వైసీపీ వైఫల్యాల వల్లనే పార్టీ ఓడింది అన్నది ముందు అధినాయకత్వం గ్రహించాలని అంటున్నారు.

జరిగిన తప్పులను పునరావృత్తం చేయకుండా ఏపీలో సంక్షేమంతో పాటు సర్వతోముఖాభివృద్ధికి వైసీపీ మార్క్ అజెండాను రెడీ చేసుకుని కొత్తగా జనంలోకి రావాల్సి ఉంది అని అంటున్నారు. ఇక పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారు అంతా అధికార దాహంతోనే అని పొరపడినా తప్పే అంటున్నారు. ఎందుకంటే వైసీపీలో నుంచి కూటమిలో చేరినా వారికి వెంటనే దక్కే పదవులు అయితే ఉండవు. కానీ వారు ఉన్న పార్టీని నమ్ముకున్న వారినీ వీడిపోతున్నారు అంటే ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లే లక్క అని అంటున్నారు. దానికి సీరియస్ గా గురించే పనిలో హైకమాండ్ ఉండాలని కూడా సూచిస్తున్నారు.