అవంతికి ఎంపీ రూట్... ఆమెకు టికెట్...!?
మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేసే చాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు.
By: Tupaki Desk | 22 Dec 2023 9:30 AM GMTమాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేసే చాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సర్వే నివేదికలను ఆధారం చేసుకుంటే కనుక ఆయనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈ మాజీ మంత్రిని అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ తరఫున పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
నిజానికి చూస్తే అవంతి ఎంపీగా 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలీ టికెట్ సాధించారు. జగన్ వేవ్ లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. మూడేళ్ళ పాటు ఆయన మినిస్టర్ గా కొనసాగారు. అయితే ఆయన పట్ల కొంత వ్యతిరేకత అయితే ఉందని పార్టీకి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయితే పార్టీకి మేలు జరుగుతుందని ఆయనకు కూడా మరో మంచి అవకాశం దక్కినట్లుగా ఉంటుందని లెక్క వేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వైసీపీ బలంగా ఉంది. దాంతో ఎంపీగా ఆయన గెలుపు సునాయాసం అంటున్నారు. పైగా బలమైన కాపు సామాజికవర్గం ఓట్లు ఎంపీ పరిధిలో ఎక్కువ. అవంతి అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకూ పార్టీకి కూడా మరింత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక భీమునిపట్నం టికెట్ ని యాదవ సామాజిక వర్గానికి చెందిన వీమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలకు ఇస్తారని అంటున్నారు. వాస్తవానికి 2019లోనే ఆమె భీమిలీ టికెట్ కోరారు. ఆమె భీమునిపట్నం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా కూడా గతంలో పనిచేసి ఉన్నారు. ఆమె సొంత ప్రాంతం కూడా అదే. భీమిలీలో కాపులతో పాటు యాదవుల సంఖ్య కూడా ఎక్కువే.
ఎపుడూ ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దాంతో వైసీపీ ఈసారి ఆ ప్రయత్నం చేయబోతోంది అని అంటున్నారు. ఫలితంగా బీసీలను ముందు పెట్టి టీడీపీని ఎదుర్కోవడమే కాదు విజయం సాధించనుందని గట్టిగానే భావిస్తున్నారు. ఇక అక్రమాన విజయనిర్మల 2019లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గట్టిగానే ఫైట్ ఇచ్చారు.
ఇపుడు ఆమె వర్గం విశాఖలో తూర్పు నుంచి పోటీ చేయబోతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హెల్ప్ కావాలంటే ఆమెకు భీమిలీ టికెట్ ఇవ్వడం సమంజసం అని అంటున్నారు. ఆ విధంగా విశాఖ జిల్లాలో రెండు టికెట్లు యాదవులకు కేటాయించడం ద్వారా బీసీల పార్టీగా వైసీపీ చాటి చెప్పుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే గాజువాక వైసీపీ ఇచార్జిగా ఉరుకూటి చంద్రశేఖర్ కి చాన్స్ ఇచ్చారు. ఆయన యాదవ కమ్యూనిటీకి చెందిన వారు.
ఇక రానున్న రోజులలో విశాఖ ఎంపీ టికెట్ ని కూడా యాదవులకే కేటాయించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అదే జరిగితే సామాజిక న్యాయం విషయంలో వైసీపీ చాంపియన్ గా నిలిచే అవకాశం గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో వైసీపీ వ్యూహాలు మాత్రం ప్రత్యర్ధులకు దడ పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.