అర్థాంతరంగా ఆగిన అవంతి రాజకీయం
ఆయన రాజకీయ జీవితం జెట్ స్పీడ్ లో సాగింది. రాజకీయల్లోకి కొత్తగా వచ్చినా ఏ బ్రేకులూ లేకుండా పొలిటికల్ ఎక్స్ ప్రెస్ దూసుకుపోయింది.
By: Tupaki Desk | 12 March 2025 6:00 PM ISTఆయన రాజకీయ జీవితం జెట్ స్పీడ్ లో సాగింది. రాజకీయల్లోకి కొత్తగా వచ్చినా ఏ బ్రేకులూ లేకుండా పొలిటికల్ ఎక్స్ ప్రెస్ దూసుకుపోయింది. ఆ రాజకీయ అదృష్టవంతుడు ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ప్రయత్నంలోనే భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.
భీమిలీ అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి చోట రాజకీయాల గురించి పెద్దగా తెలియని అవంతి బంపర్ విక్టరీ కొట్టడంతో ఆయన సక్సెస్ రూట్ బలంగా సాగేందుకు వీలు అయింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు అందులో అవంతి కొనసాగి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.
ఇక 2014 నాటికి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో కలసి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా అవంతి గెలిచి మరోసారి సత్తా చాటారు. ఆ విధంగా ఆయన అయిదేళ్ళ పాటు పార్లమెంట్ మెంబర్ గా ఒక వెలుగు వెలిగారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉండడంతో పాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో అవంతి శ్రీనివాస్ తన పలుకుబడిని బాగానే పెంచుకున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా గురి చూసి మరీ వైసీపీలో చేరిపోయారు. వైసీపీకి అనుకూలంగా గాలి బలంగా వీస్తూండంతో ఆయన ఆ పార్టీ టికెట్ సాధించి మరోమారు భీమిలీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆయనకు కీలకమైన టూరిజం శాఖ దక్కింది. దాంతో మూడేళ్ల పాటు అమాత్య హోదాలో చక్రం తిప్పారు. అయితే మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణలో అవంతికి ఆ పదవి పోయింది.
ఆనాటి నుంచి ఆయన పార్టీ తీరు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసేవారు అని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి భీమిలీలో మరోసారి పోటీ చేశారు. కానీ తొలిసారి భారీ ఓటమి ఆయనను పలకరించింది. ఒకనాటి తన రాజకీయ గురువు అయిన గంటా చేతిలోనే భారీ తేడాతో అవంతి ఓటమిని చవి చూశారు.
వైసీపీలో ఓటమి చెందాక ఆయన ఆ పార్టీని కొద్ది నెలలలోనే వీడారు. ఆయన తన టీడీపీలో తిరిగి చేరాలని ప్రయత్నాలు మొదలెట్టాని ప్రచారం సాగింది. అయితే భీమిలీ నుంచి టీడీపీ తరఫున గంటా ఎమ్మెల్యేగా ఉండడంతో అది సాధ్యపడలేదని అంటున్నారు. ఇక జనసేనలో చేరాలని చూసినా అది కూడా వీలు కాలేదని అంటున్నారు.
దాంతో అవంతి రాజకీయం అలా ఆగిపోయింది. ఇది ఆయన కోరుకున్న గ్యాప్ కాదని అంటున్నారు. అలా గ్యాప్ అయితే వచ్చేసింది. దాంతో అవంతి రాజకీయంగా వేచి చూసే ధోరణిలో ఉంటున్నారని చెబుతున్నారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. దాంతో ఆయన వాటిని చూసుకుంటూ ప్రస్తుతం ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు అని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. దాంతో కూటమి పార్టీలో చేరేందుకు అవకాశాల కోసం చూడడం తప్పించి చేసేది ఏమీ లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరనుంది అని అంటున్నారు. అదే జరిగితే భీమిలీ కూడా రెండుగా మారుతుంది. అపుడు తనకు కూడా చాన్స్ వస్తుందని అవంతి భావిస్తున్నారు అని అంటున్నారు.
ఓటమి ఎరుగని నేతగా 2024 ముందు దాకా ఉన్న అవంతికి ఇపుడు రాజకీయంగా బ్రేకులు పడడం అయితే ఆయన అనుచరులలో కలవరం కలిగిస్తోంది. రాజకీయాల్లో ఎపుడూ డైనమిక్ గా ఉండాల్సి ఉంది. ఒక్కసారి పరుగు ఆగితే మళ్ళీ జోరందుకోవడం కష్టం. దాంతో అవంతి రాజకీయ జాతకం ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.