Begin typing your search above and press return to search.

అవంతికి జగన్ ప్లస్ అవుతున్నారా...?

జగన్ విశాఖకు ఎపుడు వచ్చినా చేసే ప్రారంభోత్సవాలు కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా భీమిలీ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం విశేషం.

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:07 AM GMT
అవంతికి జగన్ ప్లస్ అవుతున్నారా...?
X

విశాఖ జిల్లా భీమునిపట్నం సీటు విషయంలో వైసీపీలో రకరకాలైన చర్చలు ఉన్నాయి. భీమిలీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆయనకు టికెట్ రాదు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే అవంతి అదృష్టం వేరే లెవెల్ లో ఉంది అని అంటున్నారు.

జగన్ విశాఖకు ఎపుడు వచ్చినా చేసే ప్రారంభోత్సవాలు కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా భీమిలీ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం విశేషం. తాజాగా ఇంఫోసిస్ ఏర్పాటు కూడా భీమిలీ పరిధిలో జరిగింది. ఇక ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం అంటున్నారు. అది కూడా భీమిలీలోనే జరగనుంది.

రుషికొండ మీద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెడితే అది భీమిలీలోనే ఉంటుంది. దీంతో అవంతి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏకంగా భీమిలీలో మకాం మార్చి అక్కడే ఉంటే వైసీపీకి భీమిలీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటుందని, రేపటి ఎన్నికల్లో అది బాగా లాభిస్తుందని అంచనా కడుతున్నారు.

ఇక ముఖ్యమంత్రే నియోజకవర్గంలో ఉంటే ఆయన వ్యూహాలు రాజకీయం ఎత్తుగడలు అన్నీ కూడా వైసీపీ ఎమ్మెల్యే గెలుపునకు సహకరిస్తాయని అంటున్నారు. దాని కంటే ముందు జగన్ ఉన్న చోట వైసీపీని గెలిపించుకోవాలన్న పట్టుదల పంతం కచ్చితంగా ఉంటాయి కాబట్టి భీమిలీ సీటుని ఎలాగైనా ఫ్యాన్ ఖాతాలో పడేలా చూస్తారని అంటున్నారు.

ఇక ఆ మధ్య దాకా అవంతికి టికెట్ రాదు అని అనుకున్నారు. ఇపుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. అవంతిని కాదు అనుకున్నా ఆ స్థాయి లీడర్ ఎవరూ ఈ తక్కువ టైం లో దొరకరు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే అవంతి కూడా ఈ మధ్య గేర్ మార్చి స్పీడ్ పెంచేశారు. కాబట్టి ఆయనకే మరోసారి చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఆయన సామాజికవర్గం రాజకీయ అనుభవం కూడా కలసి వస్తుందని లెక్క వేస్తున్నారు. జగన్ ఇంఫోసిస్ ప్రారంభం చేస్తున్నపుడు అవంతిని పక్కన పెట్టుకునే ముందుకు సాగారు. అవంతి కూడా సీఎం టూర్ పట్ల పూర్తి హ్యాపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఈసరికే అవంతిని పనిచేసుకోమని కూడా చెప్పేశారు అని అంటున్నారు.

ఇవన్నీ చూసినపుడు జగన్ విశాఖ మకాం అవంతికి బాగా ప్లస్ అయ్యేట్లుగా ఉంది అని అంటున్నారు. భీమిలీలో గత అయిదు ఎన్నికల బట్టి ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం లేదు. 1999లో టీడీపీ గెలిస్తే 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిస్తే 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది. కానీ ఈసారి అవంతి ఆ పాత రికార్డుని బద్ధలు కొట్టి రెండవసారి వరసగా గెలవబోతున్నారు అని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.