సైబర్ స్కామర్ గా కూరగాయల వ్యాపారి... 6 నెలల్లో రూ.21 కోట్లు!
ఆ సమయంలో తన కూరగాయల దుకాణం మూసేయాల్సిన పరిస్థితి రావడంతో కేటుగాడి అవతారమెత్తాడు.
By: Tupaki Desk | 4 Nov 2023 1:30 PM GMTడబ్బులు ఎవరికీ ఊరికే రావు! కరెక్టే... కష్టపడితేనే డబ్బులు వస్తాయి!! అయితే ఆ కష్టం ధర్మబద్దంగా లేకపోయినా.. చట్టబద్ధంగా అయితే ఉండాలి! అలాకానిపక్షంలో దొరకనంత కాలం దొరే కానీ... దొరికాక మాత్రం శ్రీకృష్ణ జన్మస్థలమే గతి! ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా సైబర్ స్కామర్ గా మారిన కూరగాయల వ్యాపారి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇతడు చేసిన వ్యవహారాలు బయటకు రావడంతో ముక్కున వేలేసుకుంటున్నారంట విషయం తెలిసినవారు!
అవును... ఒకప్పుడు కూరగాయలు విక్రయించి పొట్ట పోసుకునే ఒక వ్యక్తి కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో రూటు మార్చాడు. ఆ సమయంలో తన కూరగాయల దుకాణం మూసేయాల్సిన పరిస్థితి రావడంతో కేటుగాడి అవతారమెత్తాడు. ఇందులో భాగంగా కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ తెరిచి, ఉద్యోగావకాశాల పేరుతో ప్రజలను ముంచాడు. ఈ క్రమంలో ఆరునెలల కాలంలోనే కోట్లు కొట్టేశాడు. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో ఇతడిపై కేసులు ఉండటం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన కూరగాయల వ్యాపారి రిషబ్ శర్మ కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనంతరం... తన కుటుంబాన్ని పోషించడానికి, అతను వివిధ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను ప్రయత్నించాడు. అవేవీ సక్సెస్ కాకపోవడంతో ఆన్ లైన్ స్కాం లలో చేయి తిరిగిన పాత స్నేహితుడు సూచనతో శర్మ ఒక నకిలీ దందా చేపట్టాడు. ఇందులో భాగంగా... మారియట్ బాన్వాయ్ హోటల్ పేరిట నకిలీ వెబ్ సైట్ తెరిచి ఉద్యోగావకాశాల పేరుతో ప్రజలను నిండా ముంచాడు.
ఈ హోటల్ గ్రూప్ నకు సంబంధించిన రివ్యూలు రాసేందుకు పార్ట్ టైం జాబ్ ను ఆఫర్ చేశాడు. దీనికోసం ఫ్రెండ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ల నుంచి కొన్ని నెంబర్లకు ఫోన్ చేస్తూ వారికి నకిలీ ఉద్యోగావకాశాలను ఎర వేసేవాడు. తాను మారియట్ బాన్వాయ్ హోటల్ ప్రతినిధినని చెప్పుకుంటూ బాధితులకు గాలం వేసేవాడు. ఇదే సమయంలో... పాజిటివ్ రివ్యూలు రాయాలని బాధితులను కోరుతూ... ఆపై నకిలీ గెస్ట్ ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టేవాడు.
ఈ సమయంలో బాధితుల విశ్వాసం సంపాదించడానికి వారికి ముందుగా రూ. 10,000 అందించేవాడు. ఆపై మెరుగైన రిటన్స్ కోసం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరేవాడు. దీంతో... అతడి మాటలు నమ్మిన కొంతమంది భారీ మొత్తాలను పెట్టుబడిగా పెట్టేవారు. ఆ అమౌట్ అందగానే ఇతగాడు కనుమరుగుయ్యేవాడు. డెహ్రాడూన్ కు చెందిన ఓ వ్యాపారి చివరిసారిగా శర్మ చేతిలో రూ. 20 లక్షలు నష్టపోయాడు.
ఇలా చాలా మందిని మోసగించి కోట్లు కొట్టేశాడు. అది ఎంతంటే... ఆరు నెలల్లో రూ. 21 కోట్లు! ఈ క్రమంలో పది రాష్ట్రాల్లోని 37 కేసుల్లో రిషబ్ శర్మ నిందితుడు కాగా, మరో 855 సైబర్ స్కాం లలో అతడి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారని తెలుస్తుంది. ఇదే సమయంలో చైనా, సింగపూర్ వంటి దేశాల్లోని క్రిమినల్ గ్రూప్స్ తోనూ అతడికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. అక్టోబర్ 28న ఇతడిని అరెస్ట్ చేశారు!