పరారీలో వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ... అంచనాలివే!
ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పరారీలో ఉన్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 Nov 2024 5:43 AM GMTసోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. దీంతో సాధారణ కార్యకర్తలు దొరికిపోతుంటే.. నేతలు మాత్రం మిస్సైపోతున్నారనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పరారీలో ఉన్నారని తెలుస్తోంది.
అవును... కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇందులో భాగంగా.. పులివెందుల అర్బన్ ఎస్.ఐ. జీవన రంగనాథ్ ఆధవర్యంలో పోలీసు బృంధాలు ఆయన ఇంటికి వెళ్లాయి. అయితే.. రాఘవరెడ్డికి ముందే సమాచారం అందిందో ఏమో కానీ.. ఆయన ఇంటివద్ద లేడని అంటున్నారు.
వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో అతనితో రాఘవరెడ్డి ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు!
దీంతో.. ఆయన ఇంటి లోపల సోదాలు చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు.. రాఘవరెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సమయంలో రాఘవరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు లాయర్ ఓబుల రెడ్డి అక్కడకు చేరుకున్నారు.
మరోపక్క పరారైన రవీందర్ రెడ్డిని పట్టుకోవాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరరం చేశారని అంటున్నారు. అయితే.. రవీందర్ రెడ్డి తప్పించుకున్న విషయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీఐ తేజ మూర్తిపై ఇప్పటికే వేటు పడింది. ఆ స్థానంలోకి వచ్చిన ఎస్పీ విద్యాసాగర్... నాలుగు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి రవీందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారని సమాచారం!