అవినాష్ కి ఈసారి టికెట్ కట్...?
కడప ఎంపీగా ఈసారి మైనారిటీ వర్గానికి చెందిన వారికి ఇస్తారు అని అంటున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషాని కడప ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 8 Oct 2023 3:18 AM GMTకడప జిల్లాలో భారీ మార్పుల దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఈసారి సోషల్ ఇంజనీరింగ్ కి పెద్ద పీట వేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అదే టైం లో ఈసారి చాలా మంది సిట్టింగుల సీట్లలో మార్పులు ఉంటాయని కొందరికి మొండిచేయి తప్పదని కూడా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కాలం పాటు పట్టి పీడించిన ఒక కేసు వైసీపీని అతలాకుతలం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపుతూ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నడచింది. దీంతో కడప జిల్లాలో కొంత మేర వైసీపీకి ఇబ్బందులు రాజకీయంగా ఎదురయ్యాయని అంటున్నారు.
ఈ కేసు సీబీఐ విచారణలో ఉంది. న్యాయ స్థానంలో ఏదో ఒకటి తేలాల్సి ఉంది. అయితే ఈలోగా జనంలో మాత్రం కొంత వైసీపీ మీద వ్యతిరేకతను పంపించడంలో టీడీపీ సహా విపక్షాలు సక్సెస్ అయ్యాయి. అలా చూసుకుంటే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలలో పస ఎంత అన్నది తెలియదు కానీ ఆయనకు టికెట్ ఇస్తే కనుక రాజకీయంగా చిక్కులు వస్తాయన్న భావన ఉంది అంటున్నారు.
దాంతో ఈసారికి అవినాష్ రెడ్డి టికెట్ కి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. కడప ఎంపీగా ఈసారి మైనారిటీ వర్గానికి చెందిన వారికి ఇస్తారు అని అంటున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషాని కడప ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. కడప ఎంపీ సీటు దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గం చేతులలో ఉంది. పైగా అది వైఎస్సార్ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉంది.
మొదటిసారి ఆ సీటుని బయట వారికి ఇవ్వడం, అలాగే ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వడం ద్వారా వైసీపీ కొత్త రాజకీయాన్ని చేస్తోంది అంటున్నారు. అయితే కడపలో ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలకు మరింత దగ్గర కావడమే కాకుండా అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను ఆయనకు టికెట్ నిరాకరించి పోగొట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది.
అదే విధంగా కడప అసెంబ్లీ టికెట్ ని బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని అనుకుంటోందని ప్రచారం సాగుతోంది. కడప అసెంబ్లీ పరిధిలో వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే విధంగా టీడీపీ జనసేన పొత్తుల మూలంగా రాజకీయం మార్చి సామాజిక పరంగా కొత్త ఎత్తులకు తెర తీయాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఈసారి వైసీపీ అభ్యర్ధుల సెలక్షన్ మీద సొంత పార్టీలోనూ వేడిగా వాడిగా చర్చ సాగుతోంది. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో కొన్నింటిలో మార్పులు ఉంటాయని అంటున్నారు. అలాగే ఈసారి బంధువులు దగ్గరవారు అయినా సరే పనితీరు బాగులేకపోతే చెక్ పెడతారని కొత్త ముఖాలను దించుతారని కూడా చర్చ సాగుతోంది.