Begin typing your search above and press return to search.

వివేకా గెలుపు కోసం మేమూ పనిచేశాం....ఫ్లాష్ బ్యాక్ చెప్పిన అవినాష్ !

తన అక్కలు షర్మిల సునీత తన కుటుంబం మీద హత్యా నేరం మోపడం వెనక ఏలాంటి లాజిక్కూ లేదని కేవలం కక్ష సాధింపు కనిపిస్తోందని అన్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 3:59 PM GMT
వివేకా గెలుపు కోసం మేమూ పనిచేశాం....ఫ్లాష్ బ్యాక్ చెప్పిన అవినాష్ !
X

అక్కలు ఇద్దరూ లాజిక్కు లేని వాదనలతో ఎన్నికల వేళ ప్రజల బుర్రలను చెడగొట్టడానికి వస్తున్నారు అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. తన అక్కలు షర్మిల సునీత తన కుటుంబం మీద హత్యా నేరం మోపడం వెనక ఏలాంటి లాజిక్కూ లేదని కేవలం కక్ష సాధింపు కనిపిస్తోందని అన్నారు.

వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కౌంటర్ గా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబాలు అన్నీ ఒక్కటిగానే ఉంటూ వచ్చాయని చెప్పారు. దశాబ్దాల వైరమని దాయాదులు అని చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014, 2019లలో తన గెలుపు కోసం వివేకానందరెడ్డి ఎంతగానో పనిచేసారు అని ఆయన గుర్తు చేశారు.

అలాగే తమ కుటుంబం కూడా వివేకా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేందుకు ఎంతగానో శ్రమించిందని ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పారు. ఇక తమ కుటుంబానికి పదవుల మీద ఎలాంటి ఆశలు లేవని అన్నారు. తన తండ్రి భాస్కరరెడ్డి ఒకసారి వైఎస్సార్ పిలుపు మేరకు జెడ్పీటీసీగా స్థానికంగా పనిచేసారు అని మరోసారి ఉప సర్పంచ్ గా ఉన్నారని అన్నారు.

ఎవరికీ ఏ హానీ తలపెట్టని నైజం తన తండ్రిది అన్నారు. డెబ్బై నాలుగేళ్ళ వయసులో తన తండ్రి గత ఏడాదిగా జైలు పాలు అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవులు కోరుకునే వారమని కేవలం ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందని తన అక్కలు చెబుతున్నది అంతా తప్పుడు కధ అని ఆయన కొట్టిపారేశారు. తన గెలుపు కోసం చివరి రోజు కూడా వివేకా జనంలో ఉంటూ తిరిగారు అని అన్నారు.

జగన్ ని తనను తన కొడుకులుగా చెప్పుకునే వివేకాను ఎందుకు చంపుతారని ఆయన ప్రశ్నించారు. వివేకా అందరితో బాగా ఉంటారని తమ కుటుంబాలు అన్నీ ఒక్కటే అని చెప్పారు. అయితే వివేకా హత్యకు రెండేళ్ళ ముందు నుంచి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆయనని సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోలేదని అన్నారు.

ఇక వివేహా హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది వివేకా కుటుంబ సభ్యులే అని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తమకూ చెప్పారని ఆయన అన్నారు. హత్య చేసిన దస్తగిరికి బెయిల్ ఇప్పించడంతో ఆయనను అప్రూవర్ గా చేయడం వెనక ఏ చీకటి ఒప్పందాలు ఉన్నాయని అవినాష్ ప్రశ్నించారు.

అనేక సార్లు అబద్ధాలు చెబితే నిజాలు అవుతాయా అని ఆయన నిలదీశారు. వివేకా హత్య తరువాత పది రోజులకు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈ హత్య లో ప్రత్యర్ధులు ఉన్నారని చెప్పార గుర్తు చేశారు అవినాష్ రెడ్డికి తన తండ్రి ప్రచారం చేశారని కూడా చెప్పారు.

అలాంటి ఆమె ఎందుకు గొంతు మార్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో పావులుగా మారి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ అన్నారు. గత మూడేళ్ళుగా తమ కుటుంబం నరకం అనుభవిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా న్యాయ స్థానాల మీద తమకు నమ్మకం ఉందని ఏదో రోజున నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే వైఎస్ కుటుంబం అంతా పులివెందులలో ఒక్కటిగా ఉంటోందని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అవినాష్ చెప్పడం విశేషం. తమకు కావాల్సింది ప్రజలు మేలు చేయడమే అని ఆయన అన్నారు.