పీసీసీ చీఫ్ గా వారం...ఏపీ రాజకీయం గరం గరం...!
ఇంకేముంది ఏపీ పాలిటిక్స్ మొత్తం ఒక్క దెబ్బకు మారిపోతుంది అన్న విశ్లేషణలు వినిపించాయి.
By: Tupaki Desk | 29 Jan 2024 3:45 AM GMTవైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి వారం రోజులు పూర్తి అయ్యాయి. గత వారం ఆమె విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చినపుడు ఒక జోష్ అయితే కాంగ్రెస్ లో కనిపించింది. ఇంకేముంది ఏపీ పాలిటిక్స్ మొత్తం ఒక్క దెబ్బకు మారిపోతుంది అన్న విశ్లేషణలు వినిపించాయి.
షర్మిల రాకతో ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు అంతా క్యూ కడతారు అని ఆమె పార్టీలో బిగ్ షాట్స్ ఎందరో చేరిపోతారు అని కూడా లెక్కలు కట్టారు. ఇక షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కాన్వాయ్ లో వస్తున్నపుడు పోలీసులు అడ్డుకున్నారు అని ఫైర్ అయ్యారు. భయపడుతున్నారా సార్ అంటూ పంచ్ డైలాగ్ పేల్చారు. ఆ ఫైర్ ని చూసిన వారు షర్మిల దూకుడు ని వేరే లెవెల్ లో ఎంచుకున్నారు.
ఇక పీసీసీ చీఫ్ గా మాట్లాడుతూ జగన్ రెడ్డి అంటూ ఆమె తన సొంత అన్నను సంభోదించిన తీరుతోనే నెగిటివిటీని కోరి తెచ్చుకున్నారు. జగన్ రెడ్డీ అని మొదలెట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఫాలో అయింది చంద్రబాబు లోకేష్. ఒక విధంగా జగన్ ని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ పేరు కొత్తగా విపక్షం పెట్టింది.
విపక్షాలు ఆయన్ని సైకో అన్నాయి. ఇంకా దారుణంగా నిందించాయి. మరి రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చు కానీ సొంత చెల్లెలు అలా విపక్షాలు గేలి చేసిన పదాలనే వాడాలా అన్నదే న్యూట్రల్ గా ఉన్న వారి నుంచి కూడా వచ్చిన భావనలు. ఆ మీదట ఆమె రోజుకొక రకంగా విమర్శల జోరు పెంచారు. జిల్లాల టూర్లు అన్నారు. ఇచ్చాపురంతో మొదలెట్టి ఇపుడు రాయలసీమ దాకా వచ్చారు.
ఈ వారంలో ఆమె చేసిన విమర్శలలో తొంబై శాతం జగన్ ప్రభుత్వం మీదనే. కేవలం పది శాతం మాత్రమే టీడీపీ మీద. దాంతో ఆమె ఏదో మనసులో పెట్టుకుని అన్న మీద యుధ్దానికి సిద్ధం అంటూ పీసీసీ చీఫ్ గా వచ్చారు అన్న అభిప్రాయం అయితే జనంలో కలిగించారు. అదే విధంగా ఆమె దశాబ్దాల నాటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం, తొంబై ఏళ్ల వయసున్న పోలవరం ఇష్యూని టేకప్ చేయడం ఏడాది క్రితం మండిన మణిపూర్ సమస్యను ఇపుడే పుట్టినట్లుగా కొత్తగా హైలెట్ చేయడం ఇవన్నీ కూడా ఆమె విమర్శలలో పదునుని తగ్గించాయనే అంటున్నారు.
వైసీపీ కూడా ఆమెకు ధీటుగా బదులిస్తోంది. ఏపీలో విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. రాజధాని లేదు, వారసత్వంగా వచ్చిన సమస్యలకు తోడు అనేకం ఉన్నాయి. వీటికి జగన్ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది అని ఎవరైనా అంటారు కానీ మొత్తం పాపాలను ఆయనకే అంటగట్టడం అంటే మాత్రం ఒప్పుకోని పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్ కంటే ముందు అయిదేళ్ల పాటు చంద్రబాబు పాలించారు కాబట్టి.
ఇలా బాలన్స్ గా రెండు పార్టీల మీద విమర్శలు చేస్తూ విధానపరంగా ముందుకు సాగితే బాగుండేది అన్న భావన ఉంది. కానీ షర్మిల మాత్రం అలా కాకుండా నేల విడిచి సాము చేసిన చందంగా విమర్శలు అందుకున్నారు. ఏపీలో జగన్ ఏమి చేశారు అంటూ ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి ప్రశ్నించడం కూడా జనాల మెదళ్లకు ఎక్కేలా లేదు అని అంటున్నారు.
అలాగే ఏపీలో ఏమీ కాని లేని బీజేపీ మీద విమర్శలు చేయడం కూడా ఏ విధంగా కాంగ్రెస్ కి లాభిస్తుందో ఆమె చెప్పాలని అంటున్నారు. బీజేపీతో ఏపీ రాజకీయ పార్టీలు అంటకాగినా లేక దూరంగా ఉన్నా జనాలకు వచ్చిన నష్టం ఏమిటి. ఏపీ సమస్యల మీద తగిన పరిష్కారం కోసం ప్రజలు చూస్తున్నారు. ఇక పోలవరం రాజధాని ప్రత్యేక హోదా ఈ మూడింటి విషయంలో కాంగ్రెస్ బీజేపీలదే అత్యధిక శాతం తప్పు అన్న భావన జనంలో ఉంది.
అడ్డగోలు విభజన లేకపోతే ఇపుడు ఇవేమీ ఉండవు కదా అని ఈ రోజుకీ కాంగ్రెస్ ని దోషిగా చూసే జనాలే అధికంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో షర్మిల రాజకీయ దూకుడు జగన్ సర్కార్ మీద ఉన్నా పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ కి మాత్రం మేలు చేసేదిగా లేదని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ లో ఒక్క ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప ఎవరూ చేరని స్థితి అని అంటున్నారు.
ఇక చంద్రబాబు ఇపుడు జోరు పెంచారు. జిల్లాల సభలకు ఆయన వెళ్తున్నారు. దాంతో టీడీపీ మీడియా అటెన్షన్ ఆ వైపుగా మళ్ళింది. ఈ క్రమంలో వారం దాటిన తరువాత షర్మిలకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కవరేజ్ కూడా తగ్గుతోంది. ఏది ఏమైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు.
అలా వారంలోనే రాజకీయ మంట రేపి వైసీపీ వర్సెస్ షర్మిల అన్నట్లుగా గరం గరం రాజకీయంగా ఏపీని మార్చిన షర్మిల ప్రసంగాల మీద క్రమంగా ఆసక్తి తగ్గిపోతోంది. ఇకనైనా ఆమె వ్యూహాలు మార్చి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ టీడీపీ వైసీపీ సహా అన్ని పార్టీల మీద సమంగా విమర్శలు చేస్తే ఏమైనా అటెన్షన్ జనాల్లో ఉంటుందేమో చూడాలని అంటున్నారు.